Vimal | సినిమాల్లో హీరోగా కనిపించే నటులు నిజ జీవితంలో మాత్రం చాలా సాధారణంగా ఉంటూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటారు. ముఖ్యంగా తమ సొంత ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఎలాంటి భేషజాలు లేకుండా స్థానికులతో కలిసిపోయే సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అవుతుంటాయి. తాజాగా కోలీవుడ్ నటుడు విమల్‌కి సంబంధించిన ఓ వీడియో కూడా ఇదే కారణంతో నెట్టింట హల్చల్ చేస్తోంది. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పరై సమీపంలోని తన స్వస్థలానికి ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన విమల్.. పన్నన్కొంబు ప్రాంతంలో నిర్వహించే వారపు సంతను సందర్శించారు. అయితే సాధారణంగా సెలబ్రిటీలు చేసే విధంగా కాసేపు మార్కెట్‌ను చూసి వెళ్లిపోకుండా.. అక్కడి చిరు వ్యాపారుల మధ్య కూర్చొని వారితో మమేకమయ్యారు.
సంతలో కూరగాయలు విక్రయిస్తున్న వ్యాపారుల వద్ద కూర్చున్న విమల్.. అక్కడికి వచ్చిన వినియోగదారులను ఆప్యాయంగా పలకరించారు. అంతేకాదు, స్వయంగా కూరగాయలు తూకం వేసి కొనుగోలుదారులకు అందిస్తూ కొద్దిసేపు కూరగాయల వ్యాపారిగా మారిపోయారు. తమ అభిమాన నటుడు ఇలా తమ మధ్య కూర్చొని కూరగాయలు అమ్ముతుండటాన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. విషయం తెలియడంతో పలువురు ఆయన చుట్టూ చేరి మాట్లాడారు. విమల్ కూడా ఎలాంటి స్టార్డమ్ చూపించకుండా స్థానికులతో సరదాగా మాట్లాడుతూ సమయం గడిపారు. మార్కెట్లోని రైతులు, చిన్న వ్యాపారులతో కొంతసేపు ముచ్చటించిన విమల్.. వారి కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి కొందరు చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆర్థిక సాయం చేసినట్లు సమాచారం.
ఎంత ఎదిగినా తన సొంత ఊరిని, అక్కడి ప్రజలను మర్చిపోకుండా సాధారణ వ్యక్తిలా వ్యవహరించిన విమల్ తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. హీరోగా తెరపై కనిపించే వ్యక్తి.. నిజ జీవితంలో మాత్రం ఇంత సింపుల్‌గా ఉండటం అభినందనీయమంటూ కామెంట్స్ చేస్తున్నారు. విమల్ సంతలో కూరగాయలు అమ్ముతున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో విమల్ సాధారణ దుస్తుల్లో స్థానిక వ్యాపారులతో కలిసి కూర్చొని కూరగాయలు విక్రయిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.‘స్టార్ అయినా సొంత ఊరిని మర్చిపోలేదు’, ‘సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్’, ‘అభిమానుల మనసు గెలుచుకున్న హీరో’ అంటూ నెటిజన్లు విమల్‌ను ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే విమల్ ఇటీవల ఓ చెక్ బౌన్స్ కేసు కారణంగా వార్తల్లో నిలిచారు. రూ.4.5 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో ఆయనకు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు సమాచారం. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కోరడంతో శిక్షపై తాత్కాలికంగా స్టే విధించినట్లు తెలుస్తోంది.