ముంబై, అక్టోబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. కార్పొరేట్ సంస్థల నిరాశాజనక ఆర్థిక ఫలితాలకు తోడు ధరల సూచీ రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ప్రారంభంలో భారీగా కొనుగోళ్లు జరిపిన పెట్టుబడిదారులు చివరి గంటలో అమ్మకాలకు పోటెత్తారు. ఫలితంగా సూచీలు నష్టపోయాయి. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 152.93 పాయింట్లు కోల్పోయి 81,820.12 వద్దకు జారుకోగా, మరో సూచీ నిఫ్టీ 70.60 పాయింట్లు పతనం చెంది 25,057.35 వద్ద నిలిచింది.
బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు వీటి షేర్లు భారీగా నష్టపోయాయి. వీటికి తోడు టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, టాటా మోటర్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మారుతిలు షేర్లు పతనం చెందాయి. కానీ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు లాభాల్లో ముగిశాయి.