మాటలు చెప్పినంత ఈజీ కాదు తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించడం. కానీ, ఆమె అందరిలా కాదు తన పుట్టింట ఒడిసిపట్టుకున్న హస్తకళకు మెట్టినింట జీవం పోసింది. సాదాసీదా కర్ర కూడా ఆమె చేతిలో పడగానే అందమైన కళాకృతిగా మారిపోతుంది. తాను ప్రాణం పోసిన కొయ్య బొమ్మలను అనేక ఎగ్జిబిషన్లలో ఏర్పాటు చేసి హస్తకళల ప్రాముఖ్యతను చాటి చెబుతున్నది శకుంతల. వందలాది మంది మహిళలకు బొమ్మలు తయారు చేయడం నేర్పించి.. వారినీ కళాకారులుగా తీర్చిదిద్దింది. వీహబ్ సహకారంతో ఆంత్రప్రెన్యూర్‌గా ఎదిగిన శకుంతల జిందగీతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
మాది కర్ణాటక రాష్ట్రంలోని బీదర్. అమ్మానాన్నలిద్దరూ చెక్క బొమ్మలు తయారు చేస్తుండేవాళ్లు. నాకు అయిదుగురు చెల్లెళ్లు. వాళ్లంతా ఉద్యోగాలే లక్ష్యంగా కష్టపడి చదివేవాళ్లు. నేను మాత్రం పదో తరగతి వరకు మాత్రమే చదువుకొని అమ్మానాన్నలకు ఆసరా అయ్యాను. చిన్నప్పటినుంచి హస్తకళను చూస్తూ పెరగడం వల్ల వాటిమీద ఆసక్తి ఏర్పడింది. నా ఇష్టాన్ని గమనించిన మా నాన్న నన్ను రెండేళ్లపాటు బెంగళూర్ పంపించి అక్కడ హస్తకళారంగంలో శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణ నాలోని సృజనాత్మకతను వెలికితీసింది. కొన్నాళ్లకు జహీరాబాద్‌కు చెందిన నాగిశెట్టితో నా పెండ్లి జరిగింది. చెక్కబొమ్మల తయారీలో నా ఆసక్తి గురించి అత్తగారింట్లో చెప్పాను. ‘ఇక్కడ నిశ్చింతగా తయారు చేసుకోవచ్చు’ అని భరోసానిచ్చారు. అప్పటివరకు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మా ఆయన కూడా నాకు జతయ్యాడు. ఆయనకూ బొమ్మల తయారీ నేర్పించా. అప్పట్నుంచీ ఇద్దరం కలిసి బొమ్మలు తయారు చేయడాన్నే జీవనోపాధిగా ఎంచుకున్నాం.
కర్ణాటకతో పోలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ బొమ్మల తయారీకి ఆదరణ కరువు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు శ్రీకాళహస్తి ప్రాంతంలో మాత్రమే తయారు చేస్తుండేవాళ్లు. ఇక నిర్మల్ కొయ్య బొమ్మలు ఈ తరహా కావు. మొదట్లో జహీరాబాద్‌లో తయారు చేసిన బొమ్మలు కొనుక్కునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో మేం చేసిన బొమ్మలను అమ్మావాళ్లకు ఇచ్చి బీదర్‌లో అమ్మాలని చెప్పాను. నెమ్మదిగా స్థానికంగానూ తెలిసిన వాళ్లు మా బొమ్మలు కొనడం మొదలుపెట్టారు. హస్తకళను పరిచయం చేయాలనే ఆలోచనతో జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ మా స్టాల్ పెట్టేదాన్ని. అలా ఒక్కరోజు ఎంఎస్ఎంఈ అధికారులు నా స్టాల్ దగ్గరికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత నాతోని మూడు పర్యాయాలు సుమారు 500 మందికిపైగా మహిళలకు బొమ్మల తయారీలో శిక్షణ ఇప్పించారు. ఇంటినే పరిశ్రమగా మార్చుకున్న నేను 2016లో మెప్మా సహకారంతో రూ.5 లక్షలు పెట్టి కటింగ్, టర్నింగ్ యంత్రాలు కొనుగోలు చేసి నా పనికి మరింత ఆధునికత జోడించాను. మా ఇంటి నిండా బొమ్మలే కనిపిస్తాయి!

హస్తకళా రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్న నాకు 2020లో మెప్మా ఆధ్వర్యంలో పెరూ దేశానికి వెళ్లే అవకాశం లభించింది. అక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్లో నా స్టాల్ పెట్టుకోవడం గొప్ప అనుభూతి. ఇక హైదరాబాద్‌లో ఏటా జరిగే నుమాయిష్‌లో నా స్టాల్ తప్పకుండా ఉంటుంది. అక్కడికొచ్చే జనాల స్పందన కూడా బాగుంటుంది. వాళ్లందరి ప్రోత్సాహంతోనే గతేడాది శిల్పారామంలో శ్రీ దుర్గ హ్యాండీ క్రాప్ట్స్ పేరుతో స్టాల్ ఏర్పాటు చేశాను. ఒకప్పుడు నెలకు 20 నుంచి 30 వరకు మాత్రమే ఆర్డర్లు వస్తుండేవి.. శిల్పారామంలో స్టాల్ ఏర్పాటు చేసిన తరువాత నెలకు 60 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ఖర్చులు పోను నెలకు రూ.70వేల వరకు ఆదాయం వస్తున్నది. ఆర్డర్లు ఎక్కువున్న సమయంలో నేను నేర్పించిన మహిళలకు వాటిని అప్పగించి వారికీ ఉపాది కల్పిస్తున్నా.
సృజనాత్మక రంగంలో పనితోపాటు మార్కెటింగ్‌లోనూ నైపుణ్యం కావాలి. ఈ విషయంలో వీహబ్ నాకు తోడుగా నిలిచింది. అందులో శిక్షణ తీసుకున్న తరువాత మార్కెటింగ్ మెలకువలు నేర్చుకున్నా. ఒకే కుటుంబానికి చెందినవారైనా వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి అంటారు కదా. నా కుటుంబసభ్యులు మాత్రం నా ఆలోచనకు పూర్తిగా మద్దతిచ్చారు. మా ఆయన నా వెన్నంటి నడుస్తున్నాడు. ఎంసీఏ చదివిన నా కొడుకు శిల్పారామంలో మా స్టాల్ నిర్వహిస్తున్నాడు. ఎంబీఏ చదివిన నా కూతురు బొమ్మల తయారీలో నాకు సహకారం అందిస్తున్నది. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? బొమ్మల తయారీకి అవసరమైన కలపను బెంగళూరు, శివమొగ్గ నుంచి కొనుగోలు చేస్తున్నాం. అక్కడి ప్రభుత్వం ఈ కలపపై 50 శాతం రాయితీని అందిస్తున్నది. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ తీరుగా రాయితీలు అందిస్తే.. కళాకారులకు ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. ప్రభుత్వ సహకారం ఉంటేనే.. హస్తకళలు రాణించగలుగుతాయి.

వినాయకుడు, శివుడు, వేంకటేశ్వరుడు, బుద్ధుడు, క్రీస్తు తదితర ఆరాధ్య రూపాలను తయారు చేస్తున్నాం. గృహాలంకారానికి ఉపయోగపడే పూల కుండీలు, ఏనుగుల బొమ్మలతోపాటు పలు రకాల షీల్డ్‌లు, కీ చైన్లు, కుంకుమ భరిణెలు, పెన్ స్టాండ్… ఇలా అనేక కళాకృతులు తయారు చేస్తున్నాం. గంధం చెక్కలనుంచి వృథాగా వచ్చే చెక్క పొట్టును అగర్బత్తీల తయారీకి ఉపయోగిస్తున్నా.