Shadley Van Schalkwyk | టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభ మ్యాచ్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వాంఖడే స్టేడియంలో భారత్–అమెరికా మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏకపక్షంగా గెలుస్తుందనే అంచనాలను ఒక్క బౌలర్ తలకిందులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా గుర్తింపు లేని అమెరికా పేసర్ షాడ్లీ వాన్ షాక్విక్ భారత టాప్ ఆర్డర్‌ను కేవలం కొన్ని బంతుల్లోనే కూల్చి సంచలనం సృష్టించాడు. ఒక్క ఓవర్లో జరిగిన ఆ విధ్వంసం మ్యాచ్ దిశనే మార్చేసింది. అయితే ఇప్పుడు ఎవరీ షాడ్లీ వాన్ షాక్విక్? అని అందరు చర్చించడం మొదలు పెట్టారు.
షాడ్లీ వాన్ షాక్విక్ అసలు దక్షిణాఫ్రికాకు చెందిన క్రికెటర్. 1988లో కేప్‌టౌన్‌లో జన్మించిన ఆయన అక్కడే క్రికెట్లో శిక్షణ పొంది, క్లబ్ స్థాయిలో మంచి పేరు సంపాదించాడు. మెరుగైన అవకాశాల కోసం అమెరికాకు వలస వెళ్లిన షాడ్లీ, అక్కడి డొమెస్టిక్ క్రికెట్లో తన పేస్ మరియు కంట్రోల్‌తో ఆకట్టుకున్నాడు. 2024 ఏప్రిల్‌లో కెనడాపై టీ20 అరంగేట్రం చేసిన ఈ 37 ఏళ్ల పేసర్, తక్కువ సమయంలోనే అమెరికా జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. వయసు పెరిగినా ఫిట్నెస్ను కాపాడుకుంటూ వేగం తగ్గకుండా బౌలింగ్ చేయడం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి. భారత ఇన్నింగ్స్ పవర్‌ప్లే చివరి ఓవర్లో షాడ్లీ సృష్టించిన విధ్వంసం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఓవర్ రెండో బంతికి సెటిల్ అయి ఆడుతున్న ఇషాన్ కిషన్‌ను అవుట్ చేశాడు. ఐదో బంతికి తిలక్ వర్మను పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్ చివరి బంతికి శివం దూబేను ఔట్ చేశాడు. కేవలం ఐదు బంతుల వ్యవధిలో ముగ్గురు కీలక బ్యాటర్లు ఔట్ కావడంతో భారత్ 46 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. డెత్ ఓవర్లలో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన షాడ్లీ, అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా అవుట్ చేసి మొత్తం నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో షాడ్లీ వాన్ షాక్విక్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు సాధించాడు. వాంఖడే వంటి బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై స్టార్ భారత బ్యాటర్లను కట్టడి చేయడం అతని ప్రతిభను స్పష్టంగా చూపించింది. బౌలర్ మాత్రమే కాకుండా లోయర్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేసే ఆల్‌రౌండర్‌గా కూడా అతను అమెరికా జట్టుకు విలువైన ఆటగాడిగా నిలుస్తున్నాడు.
ఈ ప్రదర్శనతో షాడ్లీ వాన్ షాక్విక్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. పెద్ద జట్లను కూడా కుదిపేసే సామర్థ్యం తనకు ఉందని నిరూపించాడు. చివరికి సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ మ్యాచ్‌ను నిలబెట్టుకోకపోతే అమెరికా చారిత్రక విజయాన్ని సాధించే అవకాశం కూడా కనిపించింది. ఈ వరల్డ్‌కప్‌లో అమెరికా జట్టుకు షాడ్లీ కీలక ఆయుధంగా మారనున్నాడనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. యువ బౌలర్లకు కూడా ఆయన ప్రదర్శన ప్రేరణగా నిలుస్తోంది.