హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): దేశంలో రైతులు, పేదల గోస తీర్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేశామని, ఏడున్నరేండ్లలో రూ.లక్ష కోట్ల విలువైన ధాన్యాన్ని కొన్నామని తెలిపారు. ఏ ఒక్క నిరుపేద ఆకలితో అలమటించకుండా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా పౌరసరఫరాల శాఖ సమర్థంగా పని చేసిందని వెల్లడించారు. ప్రజలకు అవసరమైన బియ్యం, నిత్యావసరాలను సరఫరా చేసినట్టు తెలిపారు. శుక్రవారం శాసనసభలో పౌరసరఫరాలశాఖ పద్దుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ దేశానికి ధాన్యపు భాండాగారంగా మారిందని చెప్పారు. భూమికి బరువయ్యేంత పంట పండిందని పేర్కొన్నారు. ఏడేండ్లలో సుమారు రూ.లక్ష కోట్ల విలువైన 5.56 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎకరాకు 30 క్వింటాళ్ల ధాన్యం పండితే, ఆ ప్రభుత్వం 15 క్వింటాళ్లు మాత్రమే కొన్నదని వివరించారు. రైస్‌మిల్లులు, గోదాములు, రేషన్ షాపులను జియో ట్యాగింగ్ చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసినట్టు వెల్లడించారు. ఈ విధానంపై ఇతర రాష్ర్టాలు కూడా ఆసక్తి చూపుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో.. కేంద్రం కాదన్నా, సీఎం కేసీఆర్ సొంతంగా రేషన్ కార్డులను మంజూరు చేసినట్టు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం 53.68 లక్షల కార్డులు మాత్రమే ఇస్తానని చేతులెత్తేస్తే, రాష్ట్ర పేదల్ని ఆదుకొనేందుకు సొంతంగా 35.79 లక్షల కార్డులను సీఎం కేసీఆర్ జారీ చేశారని వివరించారు. తద్వారా 89.19 లక్షల మంది ఆకలిని తీర్చారని వెల్లడించారు. ఒక్క గతేడాది జూన్‌లో 3.11 లక్షల మందికి రేషన్‌కార్డులు అందజేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 90.46 లక్షల కార్డులు ఉండగా, 2.90 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు. హాస్టళ్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
సంవత్సరం కొన్న ధాన్యం (టన్నులు)
2014-15 24.29 లక్షలు
2020-21 1.41 కోట్లు
ఏడేండ్లలో 5.56 కోట్లు
విలువ రూ. లక్ష కోట్లు