హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధనకు సంబంధించి సెప్టెంబర్ కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ శనివారం వెల్లడించింది. ఈ టికెట్ల కోసం 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. లాటరీలో ఎంపికైన భక్తులు, ఈ నెల 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని స్పష్టం చేసింది. 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నది.
23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకొస్తారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కేటాయించనున్నారు. 23న ఉదయం 10 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్ల(రూ.300) కోటా, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.