స్కూల్ టాపర్. స్టూడెంట్‌గానే ఎన్నో అవార్డులు. అయినా.. సాఫ్ట్వేర్ జాబ్ వద్దనుకొని రిస్క్‌లో కాలుపెట్టాడు. పోస్టర్లు, విజిటింగ్ కార్డుల డిజైన్ మొదలుపెట్టాడు. నవ్వే వాళ్లు నవ్వుకున్నారు. ఈ అబ్బాయి ప్రయాణం మూడు వ్యాపారాలు ఆరు ప్రయోగాలు అన్నట్టుగా విజయవంతంగా సాగిపోయింది. ఇంతల్నే ఏఐ వచ్చింది. కంటెంట్ క్రియేటర్లు పని పోతుందని భయపడుతుంటే.. దానినీ తన కెరీర్‌కి ఉపయోగించుకున్నాడు. ఏఐతో ఉపాధి కల్పిస్తా రమ్మని పిలుస్తున్నాడు. ‘తెలుగు ఏఐ బూట్ క్యాంప్’లో గృహిణులు, విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలకు ఏఐ పాఠాలు చెబుతున్నాడు.ఏఐకి భయపడొద్దు, దీనిని అవకాశంగా మలచుకుందాం అంటున్న
డిజిప్రెన్యూర్ నికీలు గుండ పేదరికం నుంచి పడిలేచిన ప్రయాణం తన మాటల్లోనే.
నేను స్కూల్లో ఎప్పుడూ టాపర్నే. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కాలేజ్ ఫీజు లేకుండా నన్ను ఇంటర్మీడియెట్‌లో చేర్చుకుంది. మా నాన్న వ్యాన్ డ్రైవర్. ఒక సెల్‌ఫోన్ సర్వీస్ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేసిండు. వేరే వాళ్లతో కలిసి పోస్ట్ పెయిడ్ రీచార్జ్ డీలర్షిప్ తీసుకున్నడు. పార్ట్నర్ మోసం చేయడంతో వ్యాన్ అమ్మి కంపెనీకి పైసలు కట్టినం. ఆ తర్వాత జగిత్యాలకు దగ్గర్లోని మేడిపల్లిలో ఫోన్ రీచార్జ్ షాప్ పెట్టినం. కొన్నాళ్లకు చిన్న సెల్ఫోన్లూ అమ్మినం. ఊళ్లకు సెల్ఫోన్లు సైప్లె చేస్తుండె. సేల్స్మెన్లు మోసం చేయడంతో నాన్న మళ్లీ నష్టపోయిండు. ఫ్యామిలీకి నా అవసరం ఉందని, కాలేజీ వదిలిపెట్టాను. సైకిల్ మీద ఊళ్లు తిరుగుతూ ఎన్ని ఫోన్లు అమ్మిన్రు? ఎంత డబ్బు చెల్లించిన్రు అని లెక్కలు తీసుడు మొదలుపెట్టిన. ఆ పని చేస్తూనే సామ్‌సంగ్‌లో మొబైల్ ఇన్సూరెన్స్ జాబ్ చేసిన.
ఏడాది తర్వాత ఎంసెట్ రాసిన. డిజైన్ నేర్చుకోవాలకున్న. తాతయ్య రిటైర్మెంట్ డబ్బుతో ఫీజు కట్టి బీటెక్ (ఈసీఈ)లో చేరిన. ఇంజినీరింగ్‌లో చదివి రాయడం తప్ప ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండదని అర్థమైంది. ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులతో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ వచ్చింది. సెకండ్ ఇయర్లో… ఫ్రెండ్స్‌తో కలిసి ఇన్నోవేటివ్ క్లబ్ స్టార్ట్ చేసిన. సీఈఓలతో స్టూడెంట్ ఐడియాలను చర్చించేటోళ్లం.
డిజిటల్ లీడర్
నా చదువుకు నేనే సంపాదించుకోవాలనుకున్న. డెల్ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌లో చేరిన. ఆల్ ఇండియా టాప్ వచ్చిన. తర్వాత మైక్రోసాప్ట్లో చేసిన. అట్ల నాలుగేండ్లలో 45 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసిన. మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ స్కిల్స్ పెంచుకున్న. పరిచయాలు పెరిగినయ్. ఎక్కడ ఏ ఈవెంట్ ఉన్నా వలంటీర్‌గా పోతుంటి. సెకండ్ ఇయర్లో… డిజిటల్ అక్షరాస్యత పెంచే ‘డిజిటల్ తెలంగాణ మిషన్’లో చేరిన. ప్రభుత్వం నాకు ‘టెన్ కే డిజిథాన్ చాంపియన్’ అవార్డ్ ఇచ్చింది. తెలంగాణ ఐటీ అసోసియేషన్ ‘డిజిటల్ లీడర్ ఆఫ్ మంత్’ అవార్డ్ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్ అవార్డు వచ్చింది. సెకండ్ ఇయర్లో నా సంపాదనతో నేనే ఫీజు కట్టుకున్న. థర్డ్ ఇయర్ నుంచి ఇంటికి డబ్బులు పంపించిన.
స్వయం కృషిని నమ్ముకుని
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో క్యాప్ జెమినీలో ఆఫర్ వచ్చింది. అప్రెంటిస్ చేసినప్పుడు పరిచమైనోళ్లు ‘నికీలు మా దగ్గర పని చేయి’ అని జాబ్ ఆఫర్ చేసిన్రు. ఇంతమంది జాబ్ ఆఫర్ చేస్తున్నరంటె నాలో ఏదో ఉందనే కదా! ఎవరేమనుకున్నా సాఫ్ట్వేర్ జాబ్ వద్దనుకుని డిజైనింగ్ జాబ్ వర్క్ మొదలుపెట్టాలనుకున్న. ఫొటోషాప్ నేర్చుకున్న. జాబ్ కంటే తక్కువ ఆదాయం వచ్చినా సరేనని కన్సల్టెంట్‌గా డిజిటల్ కనెక్ట్ స్టార్ట్ చేసిన. కంపెనీ పెట్టగానే క్లయింట్స్ రారు. కాబట్టి తెలిసిన సంస్థలకు వెబ్సైట్లు, డిజైనింగ్ వర్క్స్ ఫ్రీగా చేసిన. నా వర్క్ బాగుందని వాళ్లు చెప్పడంతో వందల మంది క్లయింట్లు వచ్చిన్రు. బేగంపేటలో ఆఫీస్ తీసిన. పోస్టర్లు, లోగోలు, విజిటింగ్ కార్డులు డిజైన్ చేసిన. కొన్ని రోజులకు ఆదాయం మంచిగనే పెరిగింది.
డిజిటల్ మార్కెట్
అమెజాన్ కంపెనీ అప్పట్లో డిజిటల్ బుకింగ్ పాయింట్స్ ఫ్రాంచైజీ ఇచ్చేది. దాన్ని తీసుకుని తెలంగాణలో పదమూడు డి-కనెక్ట్ స్టోర్స్ పెట్టిన. కంపెనీ కమీషన్ ఇవ్వడం ఆలస్యం చేస్తుంటే.. మూడు నెలలకే ఆ స్టోర్స్ మూసేసి, డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన. ఇక్రిశాట్, హెచ్‌సీయూ, ఇక్ఫాయ్ బిజినెస్ స్కూల్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇచ్చిన. నేతలు, వ్యాపారుల కోసం ఎస్సెమ్మెస్ సర్వీస్ మొదలుపెట్టిన.
కోరిక తీరిందిలా..
ఓసారి మా టెక్నికల్ డెవలపర్ ‘రీప్లేస్ అండ్ డెవలప్’ బటన్ పొరపాటున నొక్కిండు. ఆ రాత్రి ఇరవై వెబ్సైట్లు ఒక్కదెబ్బకే ఎగిరిపోయినయ్. వెబ్ డిజైనింగ్ నేర్చుకొని, ఎక్కువ సమయం కష్టపడుతూ వెబ్సైట్లు డిజైన్ చేసిన. అదే టైమ్‌లో టీ వర్క్స్ ఫెలోషిప్‌కి సెలెక్ట్ అయిన పదిమందిలో నేనొకడిని. టీ వర్క్స్ కోసం మార్కెటింగ్ చేసుకుంటనే వేరేవాళ్లతో డిజిటల్ కనెక్ట్ నడిపిస్తున్న. మా తాతకు నేను గవర్నమెంట్ జాబ్ చేయాలనే కోరిక ఉండె. టీ వర్క్స్ తాత కోరిక తీర్చింది. బిజినెస్ కూడా నడుస్తున్నది.
ఆగిపోతానని సందేహం, ఏదో చేయాలనే ఆశ.. ఏడాదిన్నరకు జాబ్ వదిలేసిన. ఇంతల్నే కరోనా వచ్చింది. మోటివేషనల్ స్పీకర్ సుధీర్ సాంధ్ర డిజిటల్ సపోర్ట్ కావాలన్నడు. తనతో కలిసి ఆన్లైన్లో ‘సూపర్ స్కూల్’ మొదలుపెట్టినం. అందులో నాకు వాటా ఇచ్చిండు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కోచింగ్ స్టార్ట్ చేసిన. ‘సూపర్ మామ్’ పేరుతో మహిళలకు నైపుణ్య శిక్షణ మొదలుపెట్టినం. ఆన్లైన్లో పోస్టర్ డిజైనింగ్, వెబ్సైట్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ క్లాసులు చెప్పిన. అవి వర్కవుట్ కాలేదు.
డిజిప్రెన్యూర్!
డిజిటల్ మార్కెటింగ్‌కి డిమాండ్ ఉంది. కానీ, కంటెంట్ క్రియేటర్స్ కొరత ఉంది. ఆ సమస్యకు ఏఐ పరిష్కారం చూపింది. ఏఐ టూల్స్ వాడి కంటెంట్ క్రియేట్ చేస్తున్నం. ఇంపాక్ట్ సంస్థ వీడియో కంటెంట్ క్రియేట్ చేయడానికి వాడే ఏఐ టూల్స్ గురించి క్లాసులు చెప్పమని అడిదింది. ఫ్రీగా క్లాసులు చెప్పిన. వాళ్లు ఇంకా నేర్పించమని అడిగిన్రు. రెండు వందల మందితో ఏఐ శిక్షణ మొదలుపెట్టిన. ఆ తర్వాత దానిని కంటిన్యూ చేస్తూ సూపర్ ఏఐ అకాడమీ ద్వారా ‘తెలుగు ఏఐ బూట్ క్యాంప్’ పేరుతో శిక్షణ ఇస్తున్న. ఇరవై అయిదు రోజుల కోర్సులో వ్యాపారానికి ఉపయోగపడే ఇరవై అయిదు టూల్స్ నేర్పిస్తున్న. వాటితో ఫొటోలు, వీడియోలు, యాప్ తయారు చేయగలరు. తెలుగులో చెప్పడం వల్ల చాలా తేలిగ్గా అర్థం చేసుకుంటున్నరు. ఈ శిక్షణ ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది.
సాయిలత ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్. మా దగ్గర ఏఐ బేసిక్స్ నేర్చుకుంది. ఏఐ సాయంతో వీడియో చేసింది. ఆ మేనేజ్మెంట్ ఆమె టాలెంట్‌ని గుర్తించింది. వైస్ ప్రిన్సిపాల్‌గా ప్రమోట్ చేసింది. అడ్మిషన్లు, మార్కెటింగ్ బాధ్యతలను ఆమెకి అప్పగించి, జీతం కూడా పెంచారు. కొన్నాళ్లకే ఆమె జాబ్ వదిలిపెట్టి ఫ్రీలాన్స్‌గా పని చేస్తూ అంతకంటే డబుల్ సంపాదిస్తున్నది. ఎనిమిదో తరగతి విద్యార్థి ఏఐ నేర్చుకున్న తర్వాత ఒక నెలలో గరిష్ఠంగా లక్షా ఇరవై వేలు సంపాదించిండు! ఇలాంటి ఏఐ విజయాలెన్నో?! కాబట్టి స్టూడెంట్స్ జాబ్ కోసం ఎదురుచూడకుండా ఆంత్రప్రెన్యూర్‌గా మారాలి. ఏఐతో ఆలోచనల్ని ఆచరణలో పెట్టండి.
ఏఐ మిషన్ మిలియన్

మా అకాడమీ ద్వారా ఏఐ శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నం. ఏప్రిల్ 2027 నాటికి లక్ష మందికి, ఏప్రిల్ 2037 నాటికి పది లక్షల మందికి ఏఐ నేర్పించాలనే లక్ష్యంతో ‘ఏఐ మిషన్ మిలియన్’ ప్రారంభించిన. సైబర్ క్రైమ్ విచారణలో ఏఐ వినియోగం గురించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎనిమిది బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చిన. ఆర్టీఏ, మీ సేవ, రాజకీయ పార్టీలకు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పిస్తున్న. యూట్యూబర్స్తోపాటు స్టూడెంట్స్, గృహిణులు, వ్యాపారులకు ఇలా పాతికవేల మందికిపైగా ఏఐ నేర్పిన. వీళ్లలో ఆస్ట్రేలియా, దుబాయ్, చైనా, తైవాన్ వాళ్లూ ఉన్నరు. గృహిణుల కోసం ‘సూపర్ ఏఐ ఉమెన్స్ క్లబ్’ ప్రారంభించిన. నెల రోజుల శిక్షణలో ఏఐ నేర్పుతున్నం. వాళ్లకు ఏ నైపుణ్యం ఉంటే దానిని బట్టి ఇంటిపట్టునే బిజినెస్ చేస్తూ, డిజిటల్ మార్కెటింగ్ కూడా నేర్పుతున్నం.
-నాగవర్ధన్ రాయల