న్యూఢిల్లీ, జూన్ 13: భారత ఆర్మీ బ్రిగేడియర్‌గా నటిస్తూ పలువురిని మోసగిస్తున్న 21 ఏండ్ల యువకుడిని యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. షాజహాన్‌పూర్ స్టేషన్ హెడ్‌క్వార్టర్స్, స్థానిక మాజీ సైనికులు నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్‌లో అతడిని అరెస్ట్ చేశారు. ఆర్యన్ వర్మ అనే యువకుడు ఇండియన్ ఆర్మీ బ్రిగేడియర్ యూనిఫాం వేసుకుని తన టాటా హారియర్ వాహనానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ జెండాతో పాటు ఒక స్టార్ ప్లేట్‌ను అమర్చుకున్నాడు.
అతని రక్షణ సిబ్బందిలా కనిపించేందుకు ఇద్దరిని నియమించుకుని షజ్హాన్పూర్లో తిరుగుతుండే వాడు. రెండు నెలలుగా ఆతనిపై ఫిర్యాదులు రావడంతో నిఘా వేసిన అధికారులు జూన్ 12న ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిపించి, అతను నకిలీ ఆర్మీ అధికారి అని నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. అతని నుంచి నకిలీ ఐడీ కార్డు, ఒక ఎయిర్ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. అతనితో ఉన్న ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.