North Korea Missile Test Fire | ఉత్తరకొరియా మరోసారి కొరియా స్వల్పశ్రేణి క్షిపణి ప్రయోగం చేపట్టింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 7గంటలకు స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి.. మాక్ 5 వేగంతో దాదాపుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిపింది. క్షిపణి 50 కిలోమీటర్ల వద్ద గరిష్ట ఎత్తుకు చేరుకుందని జపాన్ రక్షణ మంత్రి యసుకాజు హమాదా పేర్కొన్నారు.
జపాన్ వెలుపల ప్రత్యేక ఆర్థిక జోన్ వెలుపల పడిపోయిందని షిప్పింగ్, ఎయిర్ ట్రాఫిక్ సమస్యల గురించి నివేదికలు లేవని మహాదా పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టనున్నాయి. విన్యాసాల్లో అమెరికాకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యూఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ దక్షిణ కొరియాలోని బూసాన్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఉత్తర కొరియా మిస్సైల్‌ను పరీక్షించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియా మిస్సైల్ ప్రయోగించడంపై దక్షిణ కొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ శాంతిభద్రతలకు ముప్పు కలిగేలా ఉందని మండిపడింది. ఉత్తర కొరియా మిస్సైల్ టెస్ట్.. తీవ్రమైన కవ్వింపు చర్యేనని సియోల్ వర్గాలు విమర్శించాయి. అయితే, సైన్యం సర్వసన్నద్ధంగా ఉందన్న సౌత్ కొరియా.. అమెరికా కలిసి రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అమెరికా, ఐక్యరాజ్య సమితి నుంచి తీవ్రమైన ఆంక్షలను ఉత్తర కొరియా ఎదుర్కొంటున్నది. అయినా, 2006 నుంచి 2017 వరకు మొత్తం ఆరుసార్లు అణ్వాయుధాలను పరీక్షించింది. ఈ ఏడాదిలోనే సుమారు 30పైగా అణ్వాయుధాలను పరీక్షించింది.