ముంబై, నవంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడి నుంచి బయటపడ్డ మదుపరులు కొనుగోళ్లకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మళ్లీ 60వేల మార్కును అధిగమించింది. 831.53 పాయింట్లు లేదా 1.40 శాతం పుంజుకుని 60,138.46 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 913.28 పాయింట్లు పెరుగడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ సైతం 258 పాయింట్లు లేదా 1.46 శాతం ఎగబాకి 17,929.65 వద్ద నిలిచింది. గత వారం వరుసగా మూడు రోజులు సూచీలు నష్టాలకే పరిమితమైన విషయం తెలిసిందే.
అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను కార్పొరేట్ సంస్థలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటం, దేశీయ పీఎంఐ తయారీ సూచీ అక్టోబర్లో 55.9కి పెరుగడం, అక్టోబర్లో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.30 లక్షల కోట్లను తాకడం వంటివి కలిసొచ్చాయి. ఆసియా, ఐరోపాసహా కీలక అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కదలాడటం కూడా భారతీయ సూచీల బలోపేతానికి కారణమేనని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఇక ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 7.46 శాతం ఎగిసింది. భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఎస్బీఐ షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. రంగాలవారీగా బీఎస్ఈ రియల్టీ, టెలికం, మెటల్, టెక్నాలజీ, ఐటీ, బేసిక్ మెటీరియల్స్ సూచీలు 3.56 శాతం మేర కోలుకున్నాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 1.79 శాతం లాభపడ్డాయి.
రూ.3.64 లక్షల కోట్లు జూమ్
సెన్సెక్స్ భారీ లాభాల మధ్య మదుపరుల సంపద సోమవారం ఒక్కరోజే రూ.3.64 లక్షల కోట్లు ఎగిసింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.3,64,524.83 కోట్లు పెరిగి రూ.2,62,84,982.90 కోట్లను తాకింది.