న్యూఢిల్లీ, నవంబర్ 19: కార్పొరేట్ల లాభాల్లో నూతన వృద్ధి కారణంగా సమీప భవిష్యత్తులో భారత స్టాక్ సూచీల ప్రదర్శన ఇతర మార్కెట్లను మించుతుందని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. లాభాల్లో వృద్ధితో పాటు ప్రభుత్వ విధానాల మద్దతు, స్థిరాదాయ నిధులు ఈక్విటీల్లోకి పెరిగే సూచనలు వంటి అంశాలతో ఇండియా దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌లో కొనసాగుతుందని మోర్గాన్ స్టాన్లీ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిథిమ్ దేశాయ్ విడుదల చేసిన తాజా నోట్లో వివరించారు. వచ్చే రెండేండ్లలో కార్పొరేట్ రాబడులు వార్షికంగా చక్రగతిన 27 శాతం వృద్ధిచెందుతాయని అంచనావేస్తున్నామని, వివిధ అంశాలు అనుకూలిస్తే బుల్‌కేస్‌లో 2022 సంవత్సరంలో సెన్సెక్స్ 80,000 పాయింట్ల స్థాయికి పెరుగుతుందని భావిస్తున్నట్లు దేశాయ్ పేర్కొన్నారు. కానీ ఇందుకు పలు సానుకూలాంశాలు భారత్‌కు కలిసిరావాలన్నారు. అవి&మూడో కొవిడ్ వేవ్, సంబంధిత లాక్డౌన్లు రాకూడదని, డాలరు, ముడి చమురు ధరలు ఒక శ్రేణికి లోబడి ఉండాలని, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును జాప్యం చేయాలన్నారు. అలాగే ఇండియాను అంతర్జాతీయ బాండ్ ఇండెక్స్‌లో చేరిస్తే దాదాపు 20 బిలియన్ డాలర్ల నిధులు దేశానికి తరలివస్తాయన్నారు. సాధారణ పరిస్థితుల్లో బేస్కేస్గా చూస్తే 2022 డిసెంబర్‌కల్లా సెన్సెక్స్ ప్రస్తుత స్థాయి నుంచి 16 శాతం పెరిగి 70,000 పాయింట్ల స్థాయికి చేరుతుందని అంచనావేస్తున్నామన్నారు.
దీర్ఘకాలిక రాబడుల దృష్తితో చూస్తే భారత్‌లో ప్రస్తుత ఈక్విటీ విలువలు అధికంగానే ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. ఏడాదికాలంగా జరిగిన పెద్ద ర్యాలీ ఫలితంగా నిఫ్టీ-50 పీఈ (ప్రైస్ టు ఎర్నింగ్స్) రేషియో ఆల్‌టైమ్ గరిష్ఠం 26 వద్దకు చేరగా, పీబీ (ప్రైస్ టు బుక్ వాల్యూ) 5కు సమీపంలో ఉంది. ఈ నేపథ్యంలో భారత ఈక్విటీలకు పలు సవాళ్లు ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ ప్రతినిధులు పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, చమురు ధరల పెరుగుదల, కీలక రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు, కొవిడ్ మూడోవేవ్ వచ్చే ప్రమాదం, దేశీయ వడ్డీ రేట్ల పెరుగుదల, సూచీలు ఇప్పటికే బాగా పెరిగి ఉండటాన్ని సవాళ్లుగా రిథిమ్ దేశాయ్ ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈక్విటీల పయనం సజావుగా ఉండదని, మార్కెట్లో ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు.
ప్రస్తుత స్థాయిల్లో స్థూలంగా పెట్టుబడిచేయకుండా, స్టాక్స్ ఎంపికచేసుకోవడం తమ వ్యూహమని, రక్షణాత్మక రంగాల బదులు సైక్లికల్ రంగాల్ని, స్మాల్ క్యాప్స్ కాకుండా లార్జ్ క్యాప్స్‌ను ఎంచుకుంటామని దేశాయ్ వెల్లడించారు. జీడీపీలో తయారీ రంగ వాటా పెరుగుతుందని, వినియోగం జోరందుకుంటుందన్న అంచనాలతో తాము ఉన్నామన్నారు. ఈ అంచనాలకు అనుగుణంగా ఫైనాన్షియల్స్, వినియోగం, తయారీ పరిశ్రమ రంగాల పట్ల సానుకూల ధోరణిని వ్యక్తంచేసారు. క్లీన్ ఎనర్జీ, రక్షణ రంగ ఉత్పత్తుల దేశీయ తయారీ, కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీ, ఆటోమొబైల్, ఎయిర్ ట్రావెల్, లైఫ్ ఇన్సూరెన్స్, డిజిటలైజేషన్, ఎలక్ట్రిక్ వాహనాలు&వచ్చే క్యాలండర్ సంవత్సరంలో తమ కీలకమైన థీమ్ అని చెప్పారు.