ముంబై, అక్టోబర్ 28: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోతున్నాయి. వరుస నష్టాలతో భీతిల్లిన మదుపరులపై గురువారం పిడుగుపడినట్లు అయింది. ప్రస్తుత నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టు గడువు ముగియనుండటం, పలు అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు భారత మార్కెట్‌ను డౌన్‌గ్రేడ్ చేయడం, విదేశీ పెట్టుబడిదారులు ఎగబడి అమ్మకాలు జరుపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ కకావికలమైంది. గత ఆరు నెలల్లో ఎన్నడూ లేనంత భారీ పతనాన్ని మూటగట్టుకున్నది. బీఎస్ఈ సెన్సెక్స్ ఒక్కసారిగా పతనమై, 60,000 స్థాయి దిగువకు పడిపోయింది. ఈ సూచి 1,159 పాయింట్ల క్షీణతతో 59,985 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 18,000 పాయింట్ల దిగువకు జారుకున్నది. ఇది 354 పాయిం ట్లు కోల్పోయి 17,857 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్ 12 తర్వాత మార్కెట్ ఇంతగా తగ్గడం ఇదే తొలిసారి. ఆ రోజున సెన్సెక్స్ 1,708 పాయింట్లు క్షీణించింది.
బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు..
బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనుకాగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు సైతం భారీ నష్టాల్ని చవిచూసాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా ఐటీసీ 5.5 శాతం పతనం చెందింది. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లు 2-5 శాతం మధ్య క్షీణించాయి. కేవలం ఆరు షేర్లు మాత్రమే లాభాలతో ముగిసాయి.
రూ.4.82 లక్షల కోట్ల సంపద హాంఫట్
తాజా మార్కెట్ పతనంతో ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.4.82 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,60,48,950 కోట్లకు తగ్గింది.