హైదరాబాద్ : సీనియర్ నటుడు డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి(Actor M.Prabhakar Reddy) సినీ పేద కార్మికులకు ఎంతగానో అండగా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. ముఖ్యంగా ఐదువేల మంది కార్మికులకు కాలనీ ఏర్పాటులో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. చిత్రపురి కాలనీలో దివంగత నటుడు ప్రభాకర్‌రెడ్డి విగ్రహాన్ని(Statue) మంత్రి శనివారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రభాకర్ రెడ్డి జన జీవితంలో తన అవసరాల కంటే తనతో సినీ రంగంలో పనిచేస్తున్న పేద కార్మికుల(Labours) అవసరమే ముఖ్యమని భావించారని వెల్లడించారు. అటువంటి మహానుబావుడు నల్లగొండ బిడ్డ అయినందుకు గర్వపడుతున్నానని అన్నారు. వృత్తి రీత్యా వైద్యుడు అయినప్పటికీ నాటక రంగం మీద ఉన్న మక్కువతో మద్రాస్ కు చేరుకుని 472 పై చిలుకు సినిమాలలో నటించారన్నారు.
హైదరాబాద్ కు సినీపరిశ్రమ తరలి వచ్చిన సందర్భంలో పరిశ్రమలు అంటే యజమానులు మాత్రమే కాదని,అందులో కార్మికులు కూడ ఉంటారని గుర్తు చేశారని తెలిపారు. డాక్టర్ల దినోత్సవం రోజున విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లోకసభ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి,శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, దర్శకుడు శంకర్, సినీనటుడు నారాయణ మూర్తి , ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.