న్యూఢిల్లీ: పెహల్గామ్ దాడితో పాకిస్థాన్‌కు లింకున్నట్లు భారత్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ.. ఇవాళ పాకిస్థాన్ సేనేట్(Pakistan Senate)లో ఏకగ్రీవ తీర్మానం చేశారు. కశ్మీర్‌లోని పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తమ దేశంపై ఆరోపణలు చేయడాన్ని భారత్ ఆపాలని నేషనల్ సెక్యూర్టీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని తీర్మానంలో పేర్కొన్నారు. డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ ఆ తీర్మానం ప్రవేశపెట్టారు. పాకిస్థాన్ పూర్తి సామర్థ్యంతో ఉన్నదని, తమ నేలను కాపాడేకునేందుకు సిద్ధంగా ఉందని, జల ఉగ్రవాదమైనా, సైనిక కవ్వింపు అయినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు దార్ తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీయడం పాకిస్థాన్ విలువలకు వ్యతిరేకమని సేనేట్ తన తీర్మానంలో పేర్కొన్నది.
పెహల్గామ్ దాడితో పాకిస్థాన్‌ను లింక్ చేయడాన్ని కూడా ఆ దేశం తప్పుపట్టింది. సింధూ జలాలా ఒప్పందాన్ని సస్పెండ్ చేయడాన్ని కూడా సేనేట్ వ్యతిరేకించింది. చట్టవ్యతిరేకమైన, ఏకపక్ష నిర్ణయమని పేర్కొన్నది. పాకిస్థాన్ ప్రజలు శాంతికి కట్టుబడి ఉన్నారని, ఈ దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు, ప్రయోజనాలకు భంగం కలగకుండా చూసుకుంటామన్నారు. పాకిస్థాన్‌తో పాటు విదేశీ గడ్డలపై భారత్ అనేక రకాల ఉగ్రవాదానికి పాల్పడిందని, దానికి ఆ దేశం బాధ్యత వహించాల్సి ఉంటుందని తీర్మానంలో డిమాండ్ చేశారు.