హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్)లో కోచ్‌ల నియామక ప్రక్రియ పక్కదారి పడుతున్నది. నిబంధనలకు పాతరేస్తూ స్థానికేతరులకు పెద్దపీట వేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాట్స్‌లో నోటిఫికేషన్ ద్వారానే కోచ్‌ల నియామకాలు చేపట్టాలంటూ 2023 అక్టోబర్ 17న జరిగిన సమావేశంలో అప్పటి క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. కానీ వాటిని బేఖాతరు చేస్తూ ప్రస్తుతం సాట్స్‌లో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ ఒకరు.. కోచ్‌ల నియామక దందాకు తెరలేపాడు. ప్రభుత్వం మారగానే పలువురు ఉన్నతాధికారులు బదిలీ వెళ్లగా, మరికొందరు ఇదే అదనుగా సాట్స్‌లో పావులు కదిపారు. సాట్స్ వైస్‌చైర్మన్, ఎండీని తప్పుదోవ పట్టిస్తూ స్థానికేతరులను కోచ్‌లుగా నియమించారు. ఇదంతా సదరు డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో నడుస్తున్నదని కోచ్‌ల సంఘాలు విమర్శిస్తున్నాయి.
నిబంధనలకు నీళ్లొదులుతూ:
సాట్స్‌లో నోటిఫికేషన్ లేకుండా కోచ్‌లను నియమించవద్దని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అయినా వాటిని అతిక్రమిస్తూ ఎల్బీ స్టేడియంలో ఒక క్రికెట్ కోచ్‌తో పాటు అథ్లెటిక్స్, వాటర్‌స్పోర్ట్స్‌లో స్థానికేతరులను నియమించారు. రూల్ 22 ప్రకారం స్థానికులను మాత్రమే కోచ్‌లుగా ఎంపిక చేయాలి. కానీ క్రికెట్, వాటర్‌స్పోర్ట్స్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓ డిప్యూటీ డైరెక్టర్ రూ.2, 3 లక్షల చొప్పున పోస్ట్‌లు అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో లాగానే జిల్లా స్థాయిలోనూ డీవైఎస్‌వోలు తమ అస్మదీయులకు పెద్దపీట వేస్తూ కోచ్‌లుగా నియమించుకున్న వైనం అవినీతికి అద్దం పడుతున్నది.
232 కోచ్‌ల పోస్ట్‌లు ఖాళీ:
ప్రస్తుతం సాట్స్‌లో 232 కోచ్‌ల పోస్ట్‌లు ఖాళీగా ఉన్నాయి. 2019లో పోస్ట్‌ల నియామకానికి అడుగులు పడినా.. అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భర్తీ చేయలేకపోయారు. దీంతో గత ఆరేండ్ల నుంచి కోచ్‌ల నియామక ప్రక్రియ అలాగే నిలిచి పోగా క్రీడాశాఖ మళ్లీ ఎలాంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపలేదు. పరిపాలన విభాగంలో పోస్ట్‌ల భర్తీకి ఆసక్తి కనబరిచే సాట్స్ అధికారులు ప్లేయర్లను తీర్చిదిద్దే కోచ్‌ల విషయంలో సవతితల్లి ప్రేమ కనబరుస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్ అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నదని కోచ్‌లు వాపోతున్నారు. నోటిఫికేషన్ లేకుండా పోస్ట్‌లు భర్తీ చేయడం అన్యాయమని, అర్హులైన ఎంతోమంది కోచ్‌లు నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని ఓ కోచ్ ఆవేదనకు గురయ్యాడు.