e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, December 8, 2021
Home News కదిలింది.. కనకాపూర్‌ తండా! సారా నుంచి స్వయం ఉపాధి వైపు..

కదిలింది.. కనకాపూర్‌ తండా! సారా నుంచి స్వయం ఉపాధి వైపు..

సారా ఘాటు మాయమైంది. ఎక్సైజ్‌ దాడులు ఆగి పోయాయి. వలసలు తగ్గిపోయాయి. ఎటు చూసినా.. మహిళా సంఘాల సభ్యులు తాళ్లు పేనుతున్న దృశ్యాలే. పాలమూరు జిల్లాలోని కనకాపూర్‌ తండా.. తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకొన్నది.

- Advertisement -

పాలమూరు జిల్లా.
మూసాపేట మండలం.
ఓ మారుమూల తండా.
పేరు కనకాపూర్‌.

మొత్తం 43 కుటుంబాలు ఉంటాయి. అంతా గిరిజనులే. మొదట్లో ఉపాధి కోసం కొందరు ముంబయి వలస వెళ్లేవారు. కొందరు నాటుసారా తయారు చేసేవారు. మిగిలినవాళ్లు కూలీనాలీ చేసి పొట్టపోసుకొనేవారు. ఎక్సైజ్‌ జీపు వస్తున్నదంటే చాలు.. గుండెల్లో బుగులు. ఎవరి ఇంటిపై దాడిచేస్తారో, ఎవర్ని అరెస్టు చేస్తారో అన్న భయం ఉండేది. ఎన్నాళ్లిలా? ఎన్నేండ్లిలా? తండావాసి ఈరమ్మ తీవ్రంగా ఆలోచించింది. ఏదో ఒకటి చేసి, తమ కాళ్లపై తాము నిలబడాలని నిర్ణయించుకుంది. తనకు తాళ్లు పేనడం తెలుసు. ఆ కళనే ఉపాధిగా ఎంచుకుంది. పుంటినారతో తాళ్లు చేసింది. కానీ, కష్టానికి తగినంత రాబడి కనిపించలేదు. ఈ సారి ముడిసరుకును మార్చింది. ఖాళీ సిమెంట్‌ సంచులు, యూరియా సంచులతో తాళ్లు పేనడం ప్రారంభించింది. పని సులభమే. సంపాదన కూడా ఫర్వాలేదనిపించింది. ఆమెను చూసి తండాలోని మిగతా మహిళా సంఘాల సభ్యులు కూడా ఇటువైపు మళ్లారు. రోజుకు ఐదొందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆదాయం లభించింది. ఆరు సంఘాలకు చెందిన అరవై మంది మహిళలు తాళ్లతోనే ఉపాధి పొందుతున్నారిప్పుడు. పెబ్బేరు, దేవరకద్ర పశువుల సంతల్లో కనకాపూర్‌ తండా తాళ్లకు మంచి గిరాకీ ఉంది. స్థానిక మార్కెట్‌కే పరిమితం కాకుండా, హైదరాబాద్‌ లాంటిచోట్ల జరిగే ఎగ్జిబిషన్లకూ వెళ్తున్నారు.

ఆర్థిక క్రమశిక్షణ

కనకాపూర్‌ మహిళలు పెట్టుబడుల కోసం ఏ వడ్డీ వ్యాపారుల ముందో బారులు తీరడం లేదు. పూర్తిగా బ్యాంకుల మీదే ఆధారపడుతున్నారు. అవసరమైన మేరకే అప్పులు తీసుకుంటున్నారు. ఠంచనుగా వాయిదాలు చెల్లిస్తున్నారు. ఆ ఆర్థిక క్రమశిక్షణ చూసి బ్యాంకు అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. లక్షల రూపాయల రుణాలు మంజూరు చేయడానికి కూడా సంకోచించడం లేదు. రుణాలకుపోగా మిగిలిన సొమ్మును పిల్లల చదువులకు, గృహ నిర్మాణాలకు దాచుకొంటున్నారు. మునుపటిలా భయాల్లేవు, తప్పు చేస్తున్నామన్న ఆత్మన్యూనత లేదు. తలెత్తుకొని జీవిస్తున్నారు. ఒకప్పుడు, నాటుసారాతో గుప్పుమన్న తండా.. నేడు శ్రమజీవన సౌందర్యంతో కళకళలాడుతున్నది.

జీవితాలు మారాయి

సొంతూరిలోనే ఉపాధి ఉందని తెలిసి, వలస వెళ్లిన కుటుంబాలన్నీ వెనక్కి వచ్చేస్తున్నాయి. ‘బతుకుదెరువు కోసం ముంబయి వెళ్లాను. కరోనాతో అక్కడి పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. బతుకు జీవుడా అనుకుంటూ సొంతూరికి వచ్చాం. తాళ్లు చేసుకుంటూ సంతోషంగా ఉంటున్నాం’ అంటూ తన వలస కథను వివరిస్తుంది చైతన్య సంఘానికి చెందిన సీత. ‘ఇటుకలు మోసే పని కోసం హైదరాబాద్‌ వెళ్లాం. కరోనా గత్తరతో ఉపాధి కష్టంగా మారింది. ఏదో ఓ మార్గం ఉండకపోదా అన్న ఆశతో తిరిగొచ్చాం. మేం కూడా తాళ్లు పేనుతున్నాం. రోజుకు ఐదు వందల వరకూ సంపాదిస్తున్నాం. సిటీలో కంటే ఇక్కడే ఆనందంగా ఉంది’ అంటున్నది బాలాజీ సంఘం సభ్యురాలు లక్ష్మమ్మ. కేసుల భయంతో ఊరి పొలిమేర వైపు చూడటానికి కూడా భయపడిన చుట్టాలు, ఇప్పుడు పండగ పబ్బాలకు వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తండా ముఖచిత్రమే మారిపోయింది. మహిళల అంకితభావాన్ని గుర్తించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తన వంతుగా.. సామూహికంగా తాళ్లు పేనుకునేందుకు ఓ కమ్యూనిటీ షెడ్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులు, రోడ్లు తదితర ప్రభుత్వ పనుల్లో వృథాగా పడేసే ఖాళీ సిమెంటు బస్తాలను తమకు ఇస్తే, ముడి సరుకు కొరత తీరుతుందని కనకాపూర్‌ మహిళా సంఘాలవారు కోరుతున్నారు. ‘కనకాపూర్‌ తండాలో చాలాకాలం నుంచీ మహిళా సంఘాలు ఉన్నాయి. వీళ్లంతా తమ ఉత్పత్తులను డ్వాక్రా బజార్లలో, సంతల్లో, సూపర్‌ మార్కెట్లలో విక్రయిస్తున్నారు. పిల్లలను బాగా చదివిస్తున్నారు. వలసలు ఆగిపోయాయి. మహిళలు ఐకమత్యంతో ఆర్థిక కష్టాలను అధిగమించడం గొప్ప విషయం’ అంటారు డీఆర్డీయే మహబూబ్‌నగర్‌ డిప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శారద.

దర్జాగా బతుకుతున్నాం

ముప్పై ఏండ్ల కింద మా తండాలో ఎలా బతకాలో కూడా తెలియనంత అయోమయం ఉండేది. నాటుసారా తయారీ వల్ల సంఘంలో చెడ్డ పేరు వస్తుందని చెప్పాను. సొంతంగా ఏదైనా పని చేసుకుని బతుకుదామని ఒప్పించాను. రాతితో పుంటినార చీల్చి తాళ్లు చేసే దాన్ని. తర్వాత సిమెంట్‌, యూరియా సంచులతో పేనడం మొదలుపెట్టాను. నన్ను చూసి మిగతావాళ్లూ ఈ మార్గంలోకి వచ్చారు. మా బతుకు మేం దర్జాగా బతుకుతున్నందుకు గర్వంగా ఉంది.
ఈరమ్మ, తుల్జా భవానీ సంఘం.

-పెద్ది విజయ భాస్కర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement