ముంబై: వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ఆసియా కప్‌నకు జట్టును ఎంపిక చేసేందుకు గాను సెలక్టర్లకు సెలక్షన్ తిప్పలు తప్పడం లేదు. ఈనెల 19న అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఆలిండియా సెలక్షన్ కమిటీ.. ఆసియా కప్‌లో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో జట్టులో ఎవరుంటారు? ఎవరిపై వేటు పడొచ్చు? అన్న చర్చ నడుస్తున్నది. ముఖ్యం గా ఫార్మాట్‌కు ఒక్కో కెప్టెన్ విధానానికి వ్యతిరేకమైన బీసీసీఐ.. దానికి చెక్ పెట్టేందుకు గాను ఇప్పటికే టెస్టు పగ్గాలు అందుకున్న శుభ్‌మన్ గిల్‌కూ పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలన్న భావనలో ఉన్నట్టు బోర్డు వర్గాల వినికిడి. ఈ క్రమంలో అతడిని ఆసియా కప్ కోసం సూర్యకుమార్ యాదవ్‌కు డిప్యూటీగా నియమించనున్నట్టు గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రస్తుతం టీ20 జట్టుకు సూర్య సారథి కాగా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే గిల్ టీ20 జట్టులోకి వస్తే ఓపెనర్ సంజూ శాంసన్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం. ఈ ఫార్మాట్లో శాంసన్, అభిషేక్ శర్మ గడిచిన ఏడాదికాలంగా నిలకడగా రాణిస్తున్నారు. మరి ఈ జోడీని విడదీసి సెలక్టర్లు.. అభిషేక్‌కు జతగా గిల్‌ను పంపిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. సంజూకు గిల్‌తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మతోనూ తీవ్ర పోటీ నెలకొంది. ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కప్ గెలవడంలో జితేశ్ది కీలకపాత్ర. మిడిలార్డర్లో అతడు ఉపయుక్తకరమైన బ్యాటర్. ఆల్‌రౌండర్ల విషయంలోనూ సెలక్టర్లకు తిప్పలు తప్పడం లేదు. హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌లో ఎవర్ని ఆడిస్తారనేది ఆసక్తికరం. ఇక ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడిన బుమ్రా.. ఆసియా కప్‌లో ఆడతాడా? లేదా? అన్నదానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతున్నది.