Plastic | తుర్కయంజాల్, జూన్ 3 : పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై కఠినమైన నిషేధం విధించాయి. 120 మెక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్ కవర్లను నిషేధత ప్లాస్టిక్ వస్తువుల జాబితాలో చేర్చి వాటిని వినియోగించిన దుకాణదారులకు, హోటళ్లకు, చిరు వ్యాపారులకు భారీ జరిమానా విధించాలని సూచించారు. అయితే ఆదిభట్ల సర్కిల్లో మాత్రం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై అధికారుల పర్యవేక్షణ కరువవడమే గాక ఆదిభట్ల సర్కిల్ పరిధిలో శానీటేషన్ విభాగం అధికారి సీజ్ చేసిన ప్లాస్టిక్ తిరిగి దుకాణదారుడికి అప్పగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫిబ్రవరి నెలలో తుర్కయంజాల్ డివిజన్ పరిధిలో ఒక దుకాణదారుడి వద్ద సుమారు 1 క్వింటాల్ 200 కిలోల ప్లాస్టిక్‌ను నాటి శానిటేషన్ అధికారి వనితా సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. సీజ్ చేసిన ప్లాస్టిక్‌ను ఆదిభట్ల డిప్యూటి కమిషనర్ సత్యనారాయణరెడ్డి, ఎస్డబ్యూం డీఈఈ స్వరణ్ కుమార్ అప్పగించారు. అయితే కొద్ది నెలలు గడిచిన అనంతరం శానీటేషన్ అధికారి వనితా బదీలీపై వెళ్లడం దుకాణదారుడు అధికారులకు వినతి పత్రం ఇవ్వడంతో అధికారులు సీజ్ చేసిన ప్లాస్టిక్‌ను సదరు దుకాణదారుడికి అప్పగించారు.
దుకాణదారుడికి ఎందుకు తిరిగి అప్పగించారనే ప్రశ్నలు..
సాధారణంగా సీజ్ చేసిన ప్లాస్టిక్‌ను రీయూజ్ కోసం పంపడం లేదా డిస్పోజ్ చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే అధికారులు మాత్రం సీజ్ చేసిన ప్లాస్టిక్ 120 మెక్రాన్ల కంటే మందంగా ఉన్నందున దుకాణదారుడి వినతిపై తిరిగి అతనికి అప్పగించామని చెప్తున్నారు. అసలు ప్లాస్టిక్ 120 మైక్రాన్ల కంటే మందంగా ఉంటే నాడు ఎందుకు సీజ్ చేసినట్లు అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రజలు ప్లాస్టిక్ సీజ్ చేయడమే గాక దుకాణదారుడికి జరిమానా సైతం విధించిన అధికారులు నాడు ప్లాస్టిక్ మందాన్ని ఎందుకు చూడలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నెలలు గడిచిన తరువాత అధికారులు ఎందుకు ప్లాస్టిక్ పరిశీలించారు. ఎందుకు దుకాణదారుడికి తిరిగి అప్పగించారనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఎవరైనా ఒత్తిడికి తలొగ్గి అధికారులు ప్లాస్టిక్ తిరిగి దుకాణదారుడిని అప్పగించారా లేక నిబంధనలకు అనుగుణంగానే ప్లాస్టిక్ అప్పగించారా అనేది ఉన్నతధికారులు పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు.
ఒకవైపు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు చేస్తున్న అధికారుల తీరుతో ఆ ప్రకటనలు పేపర్‌కే పరిమితం అవుతున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నిషేధించాల్సింది పోయి వినతి పత్రం అందజేయగానే ఎందుకు ప్లాస్టిక్‌ను తిరిగి ఇస్తున్నారని ప్రజలు పశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కొరుతున్నారు.
120 మైక్రాన్ల కంటే మందంగా ఉండడంతో తిరిగి ఇచ్చేశాము : ఎస్డబ్ల్యూఎం ఏఈఈ యోగేందర్ రెడ్డి
సీజ్ చేసిన ప్లాస్టిక్ 120 మోక్రాన్ల కంటే మందంగా ఉండడంతో దుకాణదారుడి వినతిపై ప్లాస్టిక్ దుకాణదారుడికి అప్పగించాము. సీజ్ చేసిన ప్లాస్టిక్‌ను వినియోగించబోమని తిరిగి ప్యాక్టరీకి అప్పగిస్తామని దుకాణదారుడు వినతి పత్రం ఇవ్వడంతో అతనికి తిరిగి అందజేశాము. సీజ్ చేసే రోజున వాటిని పూర్తిగా అంచనా వేయలేకపోవడంతో 1 క్వింటాల్ 200 కిలోలను సీజ్ చేశాము. అయితే కవర్లపై 120 మెక్రాన్ల కంటే మందం అని రాసి ఉండడంతో తిరిగి అప్పగించాం.
