న్యూఢిల్లీ: ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉన్న బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదం(Delhi Fire Accident)లో 21 మంది మృతిచెందారు. ఫ్లోరిష్ స్టే హోటల్లో పర్మిషన్ కేవలం ఆరు రూమ్‌లకు మాత్రమే ఉన్నది. కానీ ఆ స్టే ఇన్‌లో 24 రూమ్‌లకు బుకింగ్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. లైసెన్సు జారీ అంశంలో ఏవైనా ఉల్లంఘనలు జరిగాయా లేదా అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన అతిపెద్ద అగ్నిప్రమాద ఘటనగా ఇది నమోదు అయ్యింది.
బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ కింద ఆరు రూమ్‌లకు ఢిల్లీ టూరిజం శాఖ పర్మిషన్ ఇచ్చింది. కానీ అక్రమంగా ఆ హోటల్ గదిలో 24 రూమ్‌లను నడుపుతున్నట్లు గుర్తించారు. ఆన్లైన్ బుకింగ్‌లో ఆ హోటల్‌కు 24 రూమ్‌లు ఉన్నట్లు రిజర్వేషన్ చూపిస్తున్నది. అయిదు అంతస్తుల ఆ బిల్డింగ్ ప్రమాదంలో 40 మందిని రక్షించారు. ఆ బిల్డింగ్‌లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్ నుంచి మంటలు వ్యాపించి ఉంటాయని తొలుత అనుమానించారు. కానీ బీ అండ్ బీ ఈటరీ బిల్డింగ్ నుంచే మంటలు వ్యాప్తి చెందినట్లు అంచనాకు వచ్చారు.
21 మంది మృతుల్లో పది మంది విదేశీయులు ఉన్నట్లు నిర్ధారించారు. వారిలో ఎక్కువ శాతం మంది సెంట్రల్ ఏషియా, ఆఫ్రికా దేశస్థులు ఉన్నారు. గాయపడ్డ వారి సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బిల్డింగ్‌లో ఓ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, అయిదు అంతస్తులు ఉన్నట్లు ఢిల్లీ అగ్నిమాపక శాఖ చెబుతోంది. ఉదయం 9.30 నిమిషాల సమయంలో బిల్డింగ్‌లో మంటలు, పొగ అలుముకున్నట్లు తెలిసింది.
బీ అండ్ బీలో స్టే చేస్తున్న వారి పరిస్థితి దారుణంగా ఉంది. సమీప ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారే ఎక్కువగా బీ అండ్ బీలో బస చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ నుంచి మోకాలి మార్పిడి గురించి అయిదు రోజుల క్రితం ఓ ఫ్యామిలీ ఆ హోటల్‌కు చేరుకుని అక్కడే బస చేస్తున్నారు. బిల్డింగ్‌లో ఎటువంటి వెంటిలేషన్ లేదని, కిటికీలు లేవని, బాత్రూమ్ల్లో కూడా కిటికీలు లేవని ఓ వ్యక్తి ఆరోపించాడు. ఆ బిల్డింగ్‌కు ఒకే ఎగ్జిట్ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రెస్టారెంట్ నుంచి మంటలు వ్యాపించాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.