అందంగా అలంకరించిన పశువులు, ముచ్చటగా ముస్తాబు చేసిన ఎడ్లబండ్లు, చిరుధాన్యాల కంకులు, భద్రంగా దాచిన విత్తనాలు, కోలాటాలతో ఆకట్టుకునే పురుషులు, పాత పంటల సాగు ఆవశ్యకతను చెప్పేలా పాటలు పాడుతూ బండ్లకు తోవ చూపే మహిళలు… ఇలా కన్నుల పండువగా సాగే పంటల జాతర మళ్లీ మొదలైంది. సుమారు నెల రోజుల పాటు 14 గ్రామాల్లో కొనసాగే విత్తన సంక్రాంతి సంబురమిది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం జంలైతాండా నుంచి బుధవారం ఈ పాత పంటల జాతర ఘనంగా ప్రారంభమైంది.
డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 26 వసంతాలు పూర్తి చేసుకున్న జాతర ఈసారి మరింత వైభవంగా జరగనుంది. 400 కిలోమీటర్లు సాగే ఎండ్ల బండ్ల ఊరేగింపు ఫిబ్రవరి 13న మాచునూరులో ముగుస్తుంది. ఈ వేడుకలో 45 గ్రామాలకు చెందిన రైతులు పాలుపంచుకోనున్నారు. యాత్ర సాగినన్ని రోజులు మహిళలు చిరుధాన్యాల సాగుపై చైతన్యం తెచ్చేలా పాటలు పాడుతారు. ఏ కాలంలో ఏ పంట వేయాలి. జెర్రెల ఎరువులు ఎలా సిద్ధం చేసుకోవాలి. ఎలాంటి కషాయాలు వాడాలి. ఇలా వీరు ఒక్కో అంశాన్ని పాట రూపంలోనే అందరికీ అర్థమయ్యేలా చెబుతారు.
…?గున్నాల విట్టల్, జహీరాబాద్
