ములుగు, జనవరి 14 (నమస్తే తెలంగాణ): జిల్లాల రద్దుపై ప్రజల్లో అపోహలు వద్దని, సీఎం వ్యాఖ్యలను ఎవరూ వక్రీకరించవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. ఈనెల 13న నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ములుగు జిల్లా రద్దవుతుందా?’ అనే శీర్షికతో కథనం వెలువడగా మంత్రి సీతక్క స్పందించారు. బుధవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఏ జిల్లాను తీసివేయడం జరుగదని స్పష్టంచేసినట్టు చెప్పారు.
ఒక్కో జిల్లా నాలుగు, ఐదు నియోజకవర్గాల పరిధిలో ఉన్నట్టు తెలిపారు. ములుగు జిల్లా ఇచ్చినందుకు సంతోషమని, అనేక పోరాటాలు జిల్లా కోసం చేశామని పేర్కొన్నారు. మొదటి దశలోనే ఏర్పాటు కావాల్సిన జిల్లా.. పోరాటాలతో ప్రత్యేక జిల్లాగా ఏర్పడిందని అన్నారు. ములుగు నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలో ఉన్నదని చెప్పారు. తొమ్మిది మండలాలతో ఏర్పడిన ములుగు జిల్లాలో రెండు మండలాలు ఇతర నియోజకవర్గానికి చెందినవి ఉన్నాయని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాలు ములుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. ములుగు నియోజకవర్గానికి సంబంధించి వెంకటాపూర్ మండలంలోని ఐదు గ్రామాలైన పెద్దాపురం, గుర్రంపేట, బావ్సింగ్పల్లి, సుబ్బక్కపల్లి, రామ్నాయక్తండా భూపాలపల్లి జిల్లాలో ఉన్నట్టు చెప్పారు. ప్రభుత్వ పథకాలను ఆయా గ్రామాలకు ఏ జిల్లా నుంచి అందించాలనేది అర్థం కాకుండా ఉన్నదని చెప్పారు. ఈ ఇబ్బందులను సరిచేయాలని సీఎం ప్రయత్నిస్తున్నారని తెలిపారు.