Ind Vs SA | చెన్నై: దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ నెగ్గి పుంజుకోవాలని భావించిన భారత ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. చెన్నైలో కురిసిన వర్షం కారణంగా మ్యాచ్ అర్ధాంతరంగా రైద్దెంది. సఫారీ ఇన్నింగ్స్ ముగిశాక మొదలైన వాన ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. బ్రిట్స్ (52) మరోసారి అర్ధ సెంచరీతో మెరవగా అన్నెకి బోష్ (40) రాణించింది. గత మ్యాచ్‌లో మాదిరిగానే సఫారీ బ్యాటర్లను కట్టడి చేయడంలో టీమ్ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిశాక మొదలైన వాన ఆటను సాగనివ్వకపోవడంతో మ్యాచ్ రైద్దెంది. ఇరుజట్ల మధ్య కీలకమైన మూడో మ్యాచ్ మంగళవారం ఇదే వేదికపై జరుగుతుంది.
అవినాష్ జాతీయ రికార్డు
పారిస్: పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టీపుల్ చేజ్ రన్నర్ అవినాష్ సాబ్లె సరికొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. పారిస్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్ పోటీలలో అవినాష్.. పురుషుల 3వేల మీటర్ల పరుగు పందెంను 8 నిమిషాల 09.91 సెకన్లలోనే పూర్తి చేశాడు. తద్వారా గతంలో తానే నెలకొల్పిన 8 నిమిషాల 11.20 సెకన్ల రికార్డును బద్దలుకొట్టాడు. ఈ ఈవెంట్లో సాబ్లె ఆరో స్థానంలో నిలిచాడు.