అమీర్‌పేట్, నవంబర్ 15: ఆస్టర్ ప్రైమ్ దవాఖానల ఆధ్వర్యంలో ‘రెండో జీవితం’ పేరుతో 100 మందికి పైగా నిరుపేద చిన్నారులకు ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహించాలని నిర్ణయించింది. సీఎస్ఆర్ విభాగమైన ఆస్టర్ వలంటీర్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆస్టర్ దవాఖానల రీజనల్ డైరెక్టర్లు డాక్టర్ నితీష్ షెట్టి, డాక్టర్ ఫర్హాన్ యాసిన్‌లతో కలిసి ఆస్టర్ దవాఖానల రీజనల్ సీఈవో కే.టి.దేవానంద్ ‘రెండో జీవితం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 12 సంవత్సరాల్లోపు ఉండి దేశంలో ఐదు రాష్ర్టాల్లో విస్తరించి ఉన్న ఆస్టర్ దవాఖానల్లో చికిత్స పొందుతున్న నిరుపేద చిన్నారులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు.
ఈ కార్యక్రమం కింద అపెండిసైటిస్, ఇంటసస్పెన్షన్, ఎంపిమా, పీడియాట్రిక్ యూరాలజీ శస్త్ర చికిత్సలతో పాటు సంక్షిష్టమైన శస్త్రచికిత్సలైన బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, గుండె సంబంధిత శస్త్రచికిత్సలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ చికిత్సలకు అయే ఖర్చుకు సంబంధించిన నిధులను ఆస్టర్ డీ.ఎం.ఫౌండేషన్ వారితో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేకరిస్తామన్నారుఉ. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించేందుకు కేరళ కాలికట్లో ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని, సంప్రదించాలనుకునే వారు +919633 620660కు డయల్ చేయాలని కోరారు.