ముంబై, జనవరి 21: గ్రే మార్కెట్ కార్యకలాపాల నిరోధానికి ఐపీవో షేర్లలో ప్రీ-లిస్టింగ్ ట్రేడింగ్‌ను పరిచయం చేసే యోచనలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఉన్నది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)లో కేటాయించిన షేర్లను ఇన్వెస్టర్లు వెంటనే అమ్ముకునేలా ఓ వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నట్టు సెబీ చైర్పర్సన్ మదాబీ పురీ బచ్ మంగళవారం ఇక్కడ తెలిపారు. తద్వారా గ్రే మార్కెట్ కార్యకలాపాలకు చెక్ పెట్టాలని చూస్తున్నట్టు చెప్పారు. రెండు అగ్రశ్రేణి ప్రాక్సీ అడ్వైజరీ సంస్థలు ఈ పనిలోనే నిమగ్నమయ్యాయని, త్వరలోనే ఓ పోర్టల్ ప్రారంభం కావచ్చన్నారు. సదరు లావాదేవీలన్నీ ఇందులో నిక్షిప్తమవుతాయని, కంపెనీల్లో పాలనాపరమైన ప్రమాణాలను నిర్వహించడంలోనూ ఇది దోహదపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఇటీవలికాలంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి పెద్ద ఎత్తున ఐపీవోలు వస్తున్న విషయం తెలిసిందే. అలాగే లిస్టింగ్ రోజున భారీ లాభాలనూ నమోదు చేస్తున్న సంగతీ విదితమే. కానీ దీనికి కారణం గ్రే మార్కెట్ కార్యకలాపాలేనని సెబీ అంటున్నది. ఐపీవో ముగిసిన దగ్గర్నుంచి షేర్లు స్టాక్ మార్కెట్లలో నమోదు కావడానికి మధ్య ప్రస్తుతం 3 రోజుల విరామం ఉంటున్నది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు, ఆథరైజ్డ్ కాని డీలర్ల నడుమ అనధికార, నియంత్రణలేని క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
వీటినే గ్రే మార్కెట్ కార్యకలాపాలుగా పేర్కొంటున్నారు. అందుకే అనధికారికంగా జరుగుతున్న ఈ లావాదేవీలకు.. మదుపరులు కోరుకుంటే సక్రమ రీతిలో ఎందుకు జరుగడానికి అవకాశం ఇవ్వొద్దని ఆలోచించామని బచ్ చెప్తున్నారు. ఐపీవోలో షేర్ల కేటాయింపు జరిగిందంటే అది లీగలేనని, వాటిని అమ్ముకునే హక్కు కొన్నవారికి ఉంటుందని చెప్పారు. అందులో భాగంగానే ఐపీవో షేర్లలో ప్రీ-లిస్టింగ్ ట్రేడింగ్‌కు అనుమతిచ్చే దిశగా వెళ్తున్నట్టు తెలిపారు.