హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనమండలిలోని మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలకు ఖాళీలు ఏర్పడనున్న నేపథ్యంలో కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రస్తుత సభ్యుల పదవీకాలం మార్చి 2027లో ముగియనున్నందున ఎన్నికల ప్రక్రియ ద్వారా వాటిని భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 2026 నవంబర్ 1 అర్హత తేదీగా నిర్ణయించి డీనోవో పద్ధతిలో నూతన ఓటర్ల జాబితాలను రూపొందించాలని ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది.
ఈసారి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను పూర్తిగా పునఃసిద్ధం (డీనోవో) చేయనున్నందున, ప్రస్తుత జాబితాలో పేరున్న వ్యక్తులు కూడా తాజాగా సవరించిన ఫారమ్-18 ద్వారా నవంబర్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) తెలంగాణ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అవసరమైన పత్రాలు/సర్టిఫికెట్లను జతచేసి ఫారమ్-18ను ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, నియమిత అధికారులు, అదనపు నియమిత అధికారులకు వ్యక్తిగతంగా సమర్పించవచ్చని, దరఖాస్తులను పోస్టు ద్వారా కూడా పంపవచ్చని సూచించారు. ‘నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాల దాఖలుకు అవకాశం, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు’ అని సీఈవో వివరించారు.
