ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 17 : ఒకవైపు ప్రజాపాలనా దినోత్సవం అంటూ రాష్ట్ర ప్రభుత్వం జబ్బలు చరుచుకుంటుంటే.. మరోవైపు అదే ప్రభుత్వంలో బడుగుల పరిస్థితి దినదినగండంగా మారింది. ప్రజాపాలన కాస్త ప్రజా కంటక పాలనగా మారిందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా, ప్రజాపాలన దినోత్సవం రోజే సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్లో ఒక అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్‌కు కరెంటు కట్ చేశారు. దానికి కారణం బకాయిలు వేలల్లోనో, లక్షల్లోనో ఉన్నాయనుకుంటే పొరపాటే. నెల బకాయి కేవలం రూ.351 మాత్రమే. అది కూడా కరెంటు బిల్లు చెల్లించేందుకు చివరితేదీ అయిన 17వ తేదీ గడువు పూర్తిగా ముగియకుండానే. మరి కోట్లల్లో, లక్షల్లో బకాయిలు ఉన్న బడా బాబులకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే విద్యుత్ అధికారులు అతిధి మర్యాదలు చేస్తూ.. ఒక నిమిషం కరెంటు కోత కూడా లేకుండా జాగ్రత్తలు పడుతుండడం విశేషం. విద్యుత్ అధికారుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్నం సమయంలో ముందుగా కరెంటు కట్ చేసి.. సదరు ఫ్లాట్‌కు వెళ్లిన విద్యుత్ సిబ్బందిని ఇంట్లోని గృహిణి, ఇరుగుపొరుగువారు విషయాన్ని వివరించారు. సదరు గృహిణి కేవలం పదిహేను రోజుల కిందటే ఆ ఇంటిలోకి మారారని, ఆ బిల్లు గృహ యజమాని చెల్లిస్తారని చెప్పారు. ఇంట్లో నెలల పసిగుడ్డు, మరో చిన్నారితో తాను మాత్రమే ఉన్నానని, తన భర్త ఇంట్లో లేడని చెప్పినా వినిపించుకోకుండా రుసరుసలాడుతూ సదరు ఉద్యోగి అక్కడి నుంచి జారుకున్నాడు. దాదాపు నలభై డిగ్రీల ఎండ వేడిలో ఫ్యాన్ కూడా లేకుండా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేసినా వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. ఇక చేసేదేమీలేక సదరు బాధితురాలు చిన్నారులతో సహా పొరుగింట్లో తలదాచుకున్నారు.
దీనిపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులైన ఏఈ, ఏడీలకు ఫిర్యాదు చేసినా వారి సమాధానం విని అవాక్కవడం బాధితుల వంతైంది. బకాయి పడింది కాబట్టే కరెంట్ కట్ చేశారని వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వాపోయారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ఈ ప్రాంతానికి నేరుగా బాధ్యుడైన ఏఈ సత్యనారాయణకు పదుల సంఖ్యలో ఫోన్ చేసినా ఆయన స్పందించలేదు. ఒకసారి మాత్రం ఫోన్ ఎత్తి.. విషయం కనుక్కుని చెబుతానని చెప్పి, తిరిగి ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తలేదు. విలేకరులు ఫోన్ చేస్తేనే ఈ పరిస్థితి ఉంటే సాధారణ ప్రజానీకానికి వీరి నుంచి వచ్చే సమాధానమేంటో మనం సులువుగా అర్థం చేసుకోవచ్చని స్థానికులు చర్చించుకుంటున్నారు.
చివరికి విషయం ఎమ్మెల్యే కార్యాలయానికి చేరడంతో అక్కడి సిబ్బంది ఏఈ సత్యనారాయణకు ఫోన్ చేయగా అప్పుడు స్పందించిన సదరు ఏఈ విషయం తెలుసుకుని, కేవలం మెయిన్ ఆఫ్ చేశారని, తమ సిబ్బంది వెళ్లేసరికి మెయిన్ ఆన్ చేసే ఉందని సమాధానం ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది బాధితులకు తెలపగా, తమకు విషయం తెలియదని చెప్పారు. వేగంగా స్పందించిన ఎమ్మెల్యే సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పి, బతుకుజీవుడా అనుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకవైపు బడుగులపై ఉక్కుపాదం మోపుతుంటే.. మరోవైపు బడాబాబులకు రెడ్ కార్పెట్ వేస్తుందని ప్రజలు మండిపడుతున్నారు. హైడ్రా పేరుతో నేరుగా పేదల ఇళ్లపైకి బుల్డోజర్తో విరుచుకుపడుతున్న ప్రభుత్వం.. దానిని దూరదృష్టితో నగరంలో సంస్కరణలు, చెరువుల పరిరక్షణ వంటి కారణాలు చెబుతోందని దుయ్యబడుతున్నారు. తాజాగా విద్యుత్ ఉద్యోగుల తీరుకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు.