రూ.300 కట్టండి.. ఒక్కసారి కడితే చాలు.. లక్కీడిప్ తీస్తాం.. తగిలితే రూ.10లక్షలు వస్తాయి.. ఈ మాటలు వింటే చాలు ప్రతిఒక్కరికీ ఆశ పుట్టడం సాధారణం. డబ్బులున్నా, తెలివితేటలున్నా ఒక్కసారి కట్టి చూద్దాం.. లక్ పరీక్షించుకుందామనుకునే వారిని లక్ష్యంగా చేసుకొని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. స్కీంల పేరిట స్కాంలు చేస్తూ రూ.లక్షలు, కోట్లు దండుకుని మోసాలకు తెరతీస్తున్నారు. ఇది నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తృతంగా, బహిరంగంగా జరుగుతోంది. వివాదాలకు, మోసాలకు కేరాఫ్ అడ్రస్‌లుగా నిలుస్తున్న ఈ స్కీంలు సామాన్యులను నట్టేటా ముంచుతున్నాయి.
నాగర్‌కర్నూల్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సామాన్యుల ఆశలు కొందరు అక్రమార్కులకు సొమ్ములు కురిపిస్తున్నాయి. రాష్ట్రంలో లక్కీ డ్రా స్కీంలు నిషేధం ఉన్నా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ లాటరీ స్కీంలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. దీంతో సామాన్యుల జేబులు, ఇండ్లు గుల్లవుతున్నాయి. ఒక్కసారి రూ.300కట్టండి.. చాలు రూ.10లక్షల వరకు కార్లు, ట్రాక్టర్లు, బంగారం, బైక్‌లు తదితర బహుమతులు వస్తాయని స్కీంలు ప్రారంభిస్తున్నారు. దీనికి కొందరు సూత్రధారులుగా ఉంటున్నారు. రాజకీయ నాయకులను భాగం చేసుకుంటూ నిరుద్యోగులను ఆసరాగా చేసుకుంటూ కరపత్రాల ద్వారా ఊరూరా విస్తృత ప్రచారం చేస్తున్నారు. చైన్ సిస్టంలా ఈ స్కీంలో చేర్పించుకుంటున్నారు. స్కీంలో చేర్పించిన వారికి అధిక సొమ్ము ఆశ చూపిస్తున్నారు. దీంతో పలుకుబడి ఉన్న, చదువుకున్న యువత మాటలను నమ్మి సామాన్యులు డబ్బులు కట్టి స్కీంలో చేరుతున్నారు. ఒక్కసారే కదా, రూ.300కదా అని స్కీం నిర్వాహకులు సామాన్యులను నమ్మబలుకుతున్నారు. దీనికి ఆశపడి పేదలు వేల సంఖ్యలో డబ్బులు చెల్లిస్తూ స్కీంలో చేరుతున్నారు. తీరా డబ్బులు కట్టాక డ్రా తీసే సమయంలో స్కాం సూత్రధారులు మోసాలకు తెరతీస్తున్నారు. తమలోని వ్యక్తుల పేర్లనే డ్రాలో తీస్తూ సామాన్యులను మోసగిస్తున్నారు. స్కీంలో చేరే సమయంలో చెప్పే మాటలకు డ్రా తీసే సమయానికి మొత్తం మారిపోతుంది. వందలాది మంది సమక్షంలో తాము వేసిన పేర్లనే డీప్ ద్వారా డ్రా తీస్తూ సామాన్యులకు కుచ్చు టోపీ పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలు కొన్ని నెలలుగా జిల్లాలో బహిరంగంగా, విస్తృతంగా జరుగుతున్నాయి. తక్కువ డబ్బుకు ఎక్కువ సొమ్ము రావచ్చనే సామాన్యుల ఆశ స్కీం నిర్వాహకులకు సొమ్ములు కురిపిస్తున్నాయి. ఈ సంఘటనలు గతంలో కొల్లాపూర్‌లో, ఇటీవలే అచ్చంపేటలో, తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలోనూ జరిగాయి. కొల్లాపూర్‌లో వివాదం కావడంతో నిర్వాహకులను పోలీసులు హెచ్చరించారు. అచ్చంపేటలో అయితే నిర్వాహకులు డ్రాలో తమ వ్యక్తుల పేరిటే డ్రా తీయడం గమనార్హం. ఇక్కడే రూ.3కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ ఘటన పెద్ద గొడవకు దారి తీసింది. వేలాదిమంది సామాన్యులు తాము పూర్తిగా మోసపోయామని గుర్తించి ఆందోళన చేశారు. పోలీసులు చేరుకొని న్యాయం చేస్తామని చెప్పి ఆందోళన విరమింపజేశారు. దీంతో స్కీంలో డబ్బులు కట్టిన ప్రజలకు తిరిగి చెల్లించే ప్రక్రియ జరుగుతున్నది. ఇక కరోనా విస్తృతంగా ఉన్న ఈ సమయంలో వారం క్రితం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో దాదాపుగా 10వేల మందితో ఈ స్కీం డ్రా జరగడం విశేషం. నెలల వ్యవధిలోనే కొందరు అక్రమార్కులు మూడు నియోజకవర్గాల పరిధిలో ఇలా లక్కీ స్కీం పేరిట సామాన్యులను మోసగించే స్కాం చేయడం వివాదాలకు తావిస్తున్నది. ఈ ఘటనలో సరైన ఫిర్యాదులు, ఆధారాలు లభించక చిన్న కేసులతోనే నిర్వాహకులు తప్పించుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.
ఫిర్యాదులు చేస్తే కఠిన చర్యలు
లక్కీ డ్రా పేరిట స్కీంలు నిర్వహించడం నిషేధం. ఎవరూ ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు. ప్రజలు ఇలాంటి స్కీంలను నమ్మొద్దు. అచ్చంపేటలో కేసు నమోదు చేయడం జరిగింది. నాగర్‌కర్నూల్‌లో కరోనా నిబంధనల అమలుపై కేసు నమోదు చేశాం. ఎక్కడైనా ఇలాంటి స్కీంలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదులు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.