High Court | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజునే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని, అలాంటి వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద లభించే హకులు ఉండబోవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేసే హకు కూడా ఉండదని, ఒకవేళ ఆ విధంగా కేసు పెట్టినప్పటికీ అది చెల్లుబాటు కాబోదని తేల్చి చెప్పింది. ఇలాంటి ఫిర్యాదులపై పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది.
ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించేందుకే ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తుచేసింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా కొనసాగుతున్న చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కొందరిపై ఫిర్యాదు చేయడాన్ని ఆక్షేపించింది. ఆ పాస్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేసింది. పదేండ్ల క్రితమే క్రైస్తవ మతంలోకి మారిన ఆనంద్ ఎస్సీ కాదని పేర్కొన్నది. ఈ మేరకు జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల తీర్పు వెలువరించారు.