హైదరాబాద్, జనవరి 8 (నమస్తేతెలంగాణ)/తొర్రూరు(పెద్దవంగర): ‘పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అత్తాకోడళ్ల నుంచి కాపాడండి. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి తీరుతో నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థుల ఓటమికి వారి వైఖరే కారణం. తక్షణమే కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకొని నియోజకవర్గంలో వారి పెత్తనం నుంచి పాలకుర్తి కాంగ్రెస్ పార్టీని కాపాడండి’ అని పాలకుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ వద్ద ఏకరువు పెట్టుకున్నారు.
గురువారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షీ నటరాజన్‌ను, గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి ఫిర్యాదుచేశారు. ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, ఆమె అత్త ఝాన్సీరెడ్డి అభివృద్ధి పనుల పేరుతో నిధులు దు ర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీరెడ్డి కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. గతంలో ట్రస్ట్ పేరుతో కాలువలు తీయించామని చెప్పి, దానికి ఎంపీ నిధులు కూడా వాడుకున్నట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. సుమారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నిధులు డ్రా చేశారని చెప్పారు. ఇప్పటి వరకు ఎంపీ నియోజకవర్గానికి రూ.కోటి నిధులు మంజూరు చేశారని, కానీ ఆ నిధులు ఏమయ్యాయో, ఏ గ్రామానికి ఖర్చు పెట్టారో.. ఎమ్మెల్యే కానీ, ఆమె అత్త ఝాన్సీరెడ్డి కానీ చెప్పడం లేదని తెలిపారు. ఎంపీ కూడా పాలకుర్తికి రావడమే లేదని.. దీనిపై తాము ఎంపీని ప్రశ్నిస్తే.. మీ ఎమ్మెల్యే ఆహ్వానిస్తే వస్తానని చెప్తున్నారని మీనాక్షీ నటరాజన్‌కు అసంతృప్త నేతలు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి ప్రజలు కాంగ్రెస్‌కు 47 వేల ఓట్ల మెజారిటీ కట్టబెట్టారని, ఎమ్మెల్యే, ఆమె అత్త తీరుతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కే రెండువేల మెజారిటీ వచ్చిందని మీనాక్షికి తెలిపారు. వారి సొంత ఊరిలో అసమ్మతి వర్గ మద్దతుదారులే విజయం సాధించారని, తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క కౌన్సిలర్ కూడా గెలిచే అవకాశం లేదని వివరించారు. మీనాక్షీ నటరాజన్‌ను కలిసిన వారిలో తొర్రూరు మార్కెట్ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కిశోర్‌రెడ్డి, తొర్రూరు మాజీ ఏఎంసీ చైర్మన్ అనుమాండ్ల నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఫిరాయింపు నేతలకు పదవులతోపాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నారని, అయితే మొదట్నుంచీ కష్టపడ్డ మా సంగతేంటీ అని కాంగ్రెస్ పార్టీలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు అవుతున్నా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. గురువారం గాంధీభవన్ వేదికగా జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పలువురు నేతలు కుండబద్ధలు కొట్టారు. ఈ మేరకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఎదుట ఈ ప్రతిపాదన పెట్టారు. అయితే దీనిపై స్పందించిన మహేశ్‌కుమార్‌గౌడ్ అభ్యర్థుల ఎంపికకు ముందే వీటిపై చర్చించాలని, ఒకసారి పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే అందరూ ఆ అభ్యర్థి గెలుపుకోసం పనిచేయాలని స్పష్టంచేశారు.