హైదరాబాద్, ఆట ప్రతినిధి: వేసవి శిక్షణా శిబిరాలకు వేళయైంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా గత రెండేండ్లు పూర్తిగా రద్దయిన శిబిరాలు శనివారం నుంచి ఘనంగా మొదలవుతున్నాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) ఆధ్వర్యంలో ఇవి జరుగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఈనెల 16 నుంచి మే 31 వరకు, మిగతా జిల్లాలో మే 1 నుంచి 31 దాకా క్యాంప్‌లు కొనసాగుతాయి. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ఆవిష్కరించారు. వేసవి శిక్షణా శిబిరాలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాపంగా అన్ని క్రీడా మైదానాలు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లు ప్రారంభిస్తున్నాం. కరోనా కారణంగా రెండేండ్ల విరామం తర్వాత జరుగుతున్న శిబిరాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చదువులు, పోటీ పరీక్షలు, ర్యాంకుల ఒత్తిడి నుంచి బయటపడేందుకు పిల్లలకు ఇది మంచి అవకాశం. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి శిబిరాలు దోహదపడుతాయి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ డిప్యూ టీ డైరెక్టర్లు సుజాత, ధనలక్ష్మి, అడ్మినిస్ట్రేషన్ అధికారులు గోకుల్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.