హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఇవాళ ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ-62 ప్రయోగం విఫలమైంది. ఉదయం 10.18 నిమిషాలకు నింగిలోకి ఎగిరిన రాకెట్.. మూడవ దశలో విఫలమైంది. ఆ రాకెట్ మోసుకెళ్తున్న 15 ఉపగ్రహాలు కక్ష్యలోకి ప్రవేశించలేదు. ఆ రాకెట్ మోసుకెళ్లిన వాటిలో డీఆర్డీవో రూపొందించిన అన్వేషతో పాటు హైదరాబాద్ కంపెనీ ద్రువ స్పేస్(Dhruva Space) తయారు చేసిన ఉపగ్రహాలు ఉన్నాయి. అన్వేష అనేది నిఘా శాటిలైట్. అడ్వాన్సడ్ ఇమేజింగ్ సామర్థ్యం ఆ శాటిలైట్‌కు ఉన్నది. పొదల్లో, అడవుల్లో, బంకర్లలో దాచుకున్న వారిని ఆ శాటిలైట్ తన టెక్నాలజీతో గుర్తించగలదు. ఈఓఎస్-ఎన్1 మిషన్ ను ఇస్రోకు చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఆపరేట్ చేసింది. లాంచ్ చేసిన 15 ఉపగ్రహాల్లో ఏడు భారత్‌వి, 8 విదేశాలకు చెందినవి ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ద్రువ్ స్పేస్ సంస్థ ఏడు ఉపగ్రహాలు పంపినట్లు తెలుస్తోంది. ఇక విదేశీ ఉపగ్రహాల్లో ఫ్రాన్స్, నేపాల్, బ్రెజిల్, యూకే దేశాలకు చెందినవి ఉన్నాయి.
పోలార్ యాక్సెస్-1(పీఏ-1) ప్రోగ్రామ్ కింద ద్రువ స్పేస్ కంపెనీ శాటిలైట్లను నింగిలోకి పంపేందుకు ప్రయత్నించింది. మొత్తం 10 స్పేస్ మిషన్స్‌లో తమ పాత్ర ఉన్నట్లు కంపెనీ ఓ ప్రెస్ రిలీజ్లో పేర్కొన్నది. దేశంలోని ఆరు రాష్ట్రాలతో పాటు రెండు దేశాలకు ఆ కంపెనీ శాటిలైట్లను నిర్మించింది.
నేపాల్‌కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ అండ్ టెక్నాలజీ శాటిలైట్‌ను పంపారు. నేపాల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతరిక్ష ప్రతిషన్ నేపాల్.. దీన్ని డెవలప్ చేశాయి. ఎన్విరాన్మెంట్ మానిటరింగ్ మ్యాపింగ్‌పై ఈ ఉపగ్రహం దృష్టిపెట్టనున్నది. ఒడిషాకు చెందిన సీజీయూశాట్-1 శాటిలైట్‌ను పంపారు. భువనేశ్వర్‌కు చెందిన సీవీ రామన్ గ్లోబల్ యూనివర్సిటీ దీన్ని డెవలప్ చేసింది. ఇది ఒడిశాకు చెందిన తొలి శాటిలైట్ మిషన్. ద్రువ స్పేస్‌కు చెందిన పీ-డాట్ శాటిలైట్ ప్లాట్‌ఫామ్‌పై దాన్ని నిర్మించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్కు చెందిన సమాచారాన్ని సేకరిస్తుంది.
బెంగుళూరులోని దయానంద్ సాగర్ యూనివర్సిటీ డెవలప్ చేసిన డీశాట్-1 శాటిలైట్ ఉన్నది. దీన్ని కూడా పీ-డాట్ ప్లాట్‌ఫామ్ ద్వారా డెవలప్ చేశారు. ఈశాన్య రాష్ట్రాలకు అస్సాం ఓ శాటిలైట్ రూపొందించింది. అస్సాం డాన్ బాస్కో యూనివర్సిటీ లాచిట్-1 శాటిలైట్‌ను డెవలప్ చేసింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల కోసం దీన్ని రూపొందించారు. యునివర్సిటీల కోసం ఈ మిషన్ చేపట్టారు. ద్రువ స్పేస్‌కు చెందిన ఆస్ట్రా ప్రోగ్రామ్‌లో భాగంగా దీన్ని డెవలప్ చేశారు.
తమిళనాడులోని చెన్నైకి చెందిన ఎన్‌జీఈ ఆర్బిట్ ఎయిడ్ కూడా ఓ శాటిలైట్ రూపొందించింది. డాకింగ్, రీఫుయలింగ్ పోర్టు కోసం దీన్ని తయారు చేశారు. టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ అంశాలను ద్రువ్ స్పేస్ అందిస్తున్నది. గుజరాత్ కోసం అహ్మదాబాద్‌కు చెందిన క్యూబ్శాటి ఏరోస్పేస్ కంపెనీ ఆధ్వర్యంలో లక్ష్మణ్ జ్ఞానపీఠ స్కూల్ ఓ శాటిలైట్‌ను డెవలప్ చేసింది. అహ్మదాబాద్ నుంచి ఓ కృత్రిమ నక్షత్రాన్ని చూసే విధంగా ఎల్ఈడీ పేలోడ్‌తో దాన్ని నిర్మించారు. తెలంగాణ కోసం తైబోల్ట్-3 శాటిలైట్ రూపొందించారు. పీ-డాట్ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని డెవలప్ చేశారు.
పీఎస్ఎల్వీ సీ-62 మిషన్ విఫలం కావడంతో ద్రువ్ స్పేస్ కంపెనీకి చెందిన శాటిలైట్లు అన్నీ వృధా అయినట్లు తెలుస్తోంది. గత ఏడాది నింగి ఎగిరిన పీఎస్ఎల్వీ సీ-61 కూడా విఫలమైన విషయం తెలిసిందే.