జయశంకర్ భూపాలపల్లి(నమస్తే తెలంగాణ)/ మహాదేవ్‌పూర్, మే 19 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్యపుష్కరాలు గురువారం ప్రారంభమై వచ్చే నెల ఒకటిన ముగియనున్నాయి. 2025 మేలో జరిగిన తొలి సరస్వతి పుష్కరాలకు 35 లక్షల మంది భక్తులు రాగా ఇప్పుడు 40 లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి గురువారం పుషరాలను ప్రారంభించక సీఎం, గవర్నర్ పవిత్ర స్నానం ఆచరిస్తారని అధికారులు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్ధం 3,360 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తింపజేస్తూ పురుషులకు 50 అదనపు చార్జీ నిర్ణయించారు. కాళేశ్వరంలో 4.38 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్, 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో 10 వైద్యశిబిరాలు,10 పడకలతో రెండు మెడికల్ క్యాంపులు, 30 మంది డాక్టర్లు..420 మంది వైద్యసిబ్బందిని కేటాయించారు.
సరస్వతీ నది అంత్య పుష్కర మహోత్సవాలకు కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం సిద్ధమవుతున్నది. రూ. 23 కోట్లతో వివిధ పనులు ప్రారంభించింది. ఆది ముక్తీశ్వరస్వామి ఆలయ క్రాస్ రోడ్డు నుంచి సరస్వతీ ఘాట్‌వరకు బీటీ రోడ్డు, మ్యూజియం, కన్నెపల్లి నుంచి మెయిన్ ఘాట్ వరకు పాత నక్ష రోడ్డు, నాగదేవత ఆలయం, వీఐపీ ఘాట్ నుంచి మెయిన్ ఘాట్ వరకు తాత్కాలిక రోడ్డు, జ్ఞాన సరస్వతీ ఘాట్ వద్ద బాహుబలి సెట్, ఫ్లాట్‌ఫాం, విద్యుత్, ఆలయ ప్రాకారం, మరుగుదొడ్లు, ప్రసాద కౌంటర్ పనులు కొనసాగుతున్నాయి. గోదావరి నదిలో టెంట్ సిటీ (40 రూములు) ఏర్పాటు చేస్తున్నారు. పుష్కరాలకు రోజకో పీఠాధిపతి హాజరుకానుండగా 21న మహాగణపతి పూజతో ప్రారంభమై జూన్ ఒకటిన మహాపూర్ణాహుతితో అంత్య పుష్కర మహోత్సవాలు పరిసమాప్తం అవుతాయి.