హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆవిర్భవించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ మరో అపూర్వ ఘట్టానికి సిద్ధమైంది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినోత్సవాన్ని పురసరించుకొని, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి తీరం వెంట భారీస్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. బాసర నుంచి త్రయంబకేశ్వర్ వరకు గోదావరి నదికి ఇరువైపులా ఈ హరిత ఉద్యమం కొనసాగనుంది. ఒకే రోజు దాదాపు 99 లక్షల మొకలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
సుమారు 50 లక్షల మంది వాలంటీర్ల భాగస్వామ్యంతో ఈ మొకలను నాటి, అవి ఎదిగేవరకు సంరక్షించే బాధ్యతను గ్రీన్ ఇండియా చాలెంజ్ తీలసుకోనున్నది. ఈ హరిత ఉద్యమాన్ని గోదావరి, మంజీరా నదుల సంగమ ప్రాంతం నుంచి ప్రారంభించనున్నారు. గోదావరితోపాటు మంజీర, ప్రాణహిత నదుల పరీవాహక ప్రాంతాల్లో కూడా మొక్కలు నాటనున్నారు. మరాఠ్వాడా ప్రాంతంలో దాదాపు 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగిన నేపథ్యంలో, ఆ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడ కూడా మొకలు నాటనున్నారు.

‘నది అంటే కేవలం నీరు మాత్రమే కాదు. దానికి జీవం పోసే అడవి, దానిపై ఆధారపడే రైతు, దానిని వారసత్వంగా పొందే భావితరాలు. వీరంతా నదిలో భాగమే. గోదావరి భారతదేశానికి నాగరికతను ఇచ్చింది. ఈ ఏడాది భారతదేశం ఆ నదికి తిరిగి కృతజ్ఞత సమర్పించుకుంటున్నది’ అని సంతోష్ పేరొన్నారు. ప్రకృతిలో భాగమైన గోదావరి నదికి ఏదైనా తిరిగి ఇవ్వాలనే భావనతోనే ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నట్టు తెలిపారు.
నదికి కృతజ్ఞతగా చేపట్టిన ఈ హరిత ఉద్యమం ద్వారా నేల కోత తగ్గడంతోపాటు, వాతావరణంలో సానుకూల మార్పులు వస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒకరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, సాధారణ పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొకలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయనున్నారు. గత హరితహారం స్ఫూర్తితో 3-3-3 మోడల్‌ను ముందుకు తీసుకువెళ్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు కృషి చేయనున్నారు.
వచ్చే ఐదేండ్లలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఏకంగా 100 కోట్ల మొకలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సంతోష్ తెలిపారు. 2031 అక్టోబర్ 15న జరిగే మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి నాటికి ఈ సంకల్పాన్ని విజయవంతంగా పూర్తిచేయనున్నామని పేర్కొన్నారు.