బూర్గంపహాడ్, ఆగస్టు 31 : బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. మేజర్ పంచాయతీలో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, డ్రైనేజీలను పిచ్చి చెట్లు కమ్మేసి కనిపిస్తున్నాయి. అసలే వర్షాకాలం. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో పారిశుధ్య చర్యలు ముమ్మరంగా చేపట్టాల్సిన పంచాయతీ అధికారులు పారిశుధ్యంపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు బలంగా వినవస్తున్నాయి. కొన్ని వార్డుల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి అడవిని తలపిస్తున్నాయి. డ్రైనేజీలో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. బూర్గంపహాడ్ మేజర్ పంచాయతీలో సమస్యలపై సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి దృష్టి సారించి తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
మేజర్ పంచాయతీలో పారిశుధ్యంపై పంచాయతీ అధికారులు దృష్టి సారించాలి. వార్డుల్లో చెత్తాచెదారం పేరుకుపోయింది. 7వ వార్డుతో పాటు కొన్ని వార్డుల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. డ్రైనేజీల్లో మురుగునీటిని శుభ్రం చేసి దోమలను నివారించాలి. పారిశుధ్యం లోపించడంతో సమస్యకు సంబంధించి ప్రజావాణిలో సంబంధిత అధికారులకు సైతం వినతిపత్రం ఇచ్చాం. మేజర్ పంచాయతీలో సమస్యలను గుర్తించి పరిష్కరించాలి.