సంగారెడ్డి, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై సస్పెన్షన్ వేటు వేయడం పంచాయతీశాఖలో కలకలం రేపుతున్నది. పంచాయతీ ఎన్నికల్లో కీలక విధులు నిర్వహించాల్సిన డీపీవో సాయిబాబా పదేపదే సెలవులపై వెళ్లడం ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తుంది. దీనికితోడు సాయిబాబాపై తరుచూ అవినీతి ఆరోపణలు రావడం సస్పెన్షన్కు దారితీసినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. జిల్లా పంచాయతీశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టింది మొదలు సాయిబాబా పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.
విధ నిర్వహణలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు పంచాయతీ కార్యదర్శులు బదిలీలు, ఇతర అంశాల్లో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగు నెలల క్రితం కొంతమంది పంచాయతీ కార్యదర్శులు కలెక్టర్ ప్రావీణ్యతో పాటు పంచాయతీశాఖ ఉన్నతాధికారులకు సాయిబాబాపై ఫిర్యాదు చేశారు. డీపీవో అవినీతికి పాల్పడుతున్నారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదే సమయంలో విధులకు సక్రమంగా హాజరుకావడం లేదన్న ఆరోపణ లు వచ్చాయి. కలెక్టర్ ప్రావీణ్య నిర్వహించిన సమీక్ష సమావేశాలతోపాటు ఉన్నతాధికారుల వీడియోకాన్ఫరెన్స్లకు గైర్హాజరైనట్లు సమాచారం. దీనిని సీరియస్గా తీసుకున్న కలెక్టర్ ప్రావీణ్య, రెండు నెలల క్రితం డీపీవోను సరెండర్ చేసేందుకు ప్రయత్నించారు.
డీపీవో పార్టీకి చెందిన ఓ ముఖ్యనేతను ఆశ్రయించి ఆయన ద్వారా ఉన్నతాధికారులు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. ఇటీవల పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం డీపీవో సాయిబాబా తన కార్యాలయంలోనే సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిసింది. దీంతో వైద్య చికిత్సల కోసం ఆయన మూడురోజుల పాటు సెలవులు పెట్టినట్లు తెలుస్తుంది. తిరిగి విధుల్లో చేరిన ఆయన కలెక్టర్ నిర్వహించిన ఎన్నికల సమీక్షా సమావేశానికి గైర్హాజరయ్యారు. అంతేకాకుండా తిరిగి సెలవులో వెళ్లినట్లు సమాచారం.
దీనిని సీరియస్గా పరిగణించిన కలెక్టర్ డీపీవో నిర్లక్ష్య వైఖరిని ఉన్నతాధికారుల దృ ష్టికి తీసుకెళ్లడంతో పంచాయతీ శాఖ ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిం ది. ఎన్నికల వేళ డీపీవో స్థాయి అధికారినే సస్పెండ్ చేయడంతో పంచాయతీశాఖ అధికారులతో పాటు క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యదర్శులు భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదన్న వారిలో కనిపిస్తున్నది. డీపీవో సస్పెన్షన్ వెనుక రాజకీయ ఒతిళ్లు ఉన్నాయని, చెప్పిన పనిచేయకపోవడంతో ఆగ్రహించిన అధికార పార్టీకి చెందిన ఓ నేత డీపీవోను సస్పెన్షన్ చేయించినట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.