అధిక లాభాలు, నమ్మకమే పెట్టుబడి అంటూ చిట్టీల వ్యాపారం నిర్వహించిన ఓ దంపతులు చివరికి సభ్యులకు టోకరా ఇచ్చి పరారైన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వెలుగుచూసింది. ఈ ఘటనలో సుమారు రూ.3 కోట్ల మేర మోసం జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన శిరీష, సాంబశివరావు దంపతులు చాలాకాలం కిందట హైదరాబాద్కు వచ్చి అమీన్పూర్లోని బీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సాయి గణేశ్ టెక్స్టైల్స్ పేరిట బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే చిట్టీల వ్యాపారం కూడా చేస్తున్నారు. . అయితే నెలనెల డబ్బులు సేకరించిన దంపతులు గడువు పూర్తయినా తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే స్థానికుల నుంచి చిట్టీల పేరిట రూ.2కోట్ల మేర డబ్బులను సేకరించారు. ఆ తర్వాత అమీన్పూర్లోని తమ ఇంటిని అమ్మేసి, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పరారయ్యారు.
దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దంపతుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Guntur Couple Chif Fund Sca
మరోవైపు బుద్వేల్లోనే ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. బుద్వేల్లో నివాసం ఉండే అశోక్ దంపతులు చిట్టీల పేరిట స్థానిక మహిళలు, చిన్న వ్యాపారుల నుంచి భారీ మొత్తం సేకరించారు. అనంతరం తన భార్యతో కలిసి ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన బాధితులు.. అశోక్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. తాము పైసా పైసా దాచిపెట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.