“ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్.. ఈ చాయ్ చమక్కులే చూడరా చాయ్.. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్.. ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్..” అని ఓ సినీ కవి మధురమైన టీ మనసు దోచే విధానాన్ని వర్ణించారు. అప్పట్లో అందుబాటులో ఉన్న చాయ్ రకాలను వివరిస్తూ ఈ చక్కని చిక్కటి చాయ్ గురించి గేయాన్ని రాశాడు. ప్రస్తుతం ట్రెండ్ మారింది. అనేక రకాల ప్లేవర్స్‌లో టీలు అందుబాటులోకి వచ్చాయి. పది రూపాయల నుంచి వందల రూపాయల వరకు ధరల్లో లభిస్తున్నాయి. హైదరాబాద్‌కు సమీపంలోని పటాన్‌చెరుతో పాటు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన వివిధ రకాల హోటళ్లలో తయారు చేస్తున్న టీ, కాఫీలు మనసు దోచేస్తున్నాయి. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే వారు ఎంతో ఇష్టంగా ఆగి రుచిచూస్తున్నారు. యువత ఇష్టంగా వచ్చి వారికి నచ్చిన టీ ఆర్డర్ ఇచ్చి తాగుతున్నారు. కాకా హోటల్ నుంచి కాఫీడే వరకు విభిన్నంగా టీస్టాళ్లు నిర్వహిస్తున్నారు. వీటితో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. దీనిపై
ఆదివారం ప్రత్యేక కథనం…
చాయ్… ప్రజలు ఉషోదయంతోటే పలికే తొలిపదం.. కోరే తొలిరుచి.. అవును టీ లేకుండా దినమే ప్రారంభం కాదు చాలామందికి. కడుపులో కాసింత వేడివేడి చాయ్ పడితేనే ఉత్సాహం, ఆ రోజు సక్రమంగా ఉంటుంది. టీ ప్రజలతో పెనవేసుకున్నది. ఇంటికి వెళ్తే కనీసం చాయ్కూడా తాగమనలేదనే ఎత్తిపొడుపులు, వ్యగ్యం వింటుంటాం. దోస్తుల్లోనూ అంతే చాయ్ తాపలేదని సర్వసాధారణం.. ఇంటికి ఎవరు వచ్చినా ముందుగా చాయ్ తాపాలనే సంస్కృతి మనది. చాయ్‌తో బంధం మన తాతల కాలంనుంచే ఉంది. “చాయ్ చమక్కురా భాయ్” అంటూ సినీ కథానాయకులు పొగిడిన, వేడివేడి.. చాయ్ చుక్కలు నోట్లో వెళ్తుంటే అక్షరాలు చకచకా రాసే సాహితీవేత్తలు సర్వత్రా కనిపిస్తారు. నోరూరించే చాయ్‌పై ఈవారం ప్రత్యేక కథనం…
చాయ్ చరిత్రను తవ్వితే లోతు ఊహించలేం. అందరు విశిష్టంగా అభిమానించే చాయ్‌లు కొత్త రూపం సంతరించుకున్నాయి. వంద రకాల టీలు మార్కెట్లో దొరుకుతున్నాయి. చాయ్, కాఫీ అనే రెం డు మాటలే ఒక్కప్పుడు వినేవాళ్లం. ఇప్పుడు అల్లంచాయ్, గ్రీన్‌టీ, మసాల చాయ్, దమ్క చా య్, ఇరానీ చాయ్, తందూరి చాయ్, కటింగ్ చాయ్, ఇమ్యూనిటీ చాయ్ ఇలా అనేక రూపాల్లో లభిస్తున్నాయి. చాయ్ అంటేనే లొట్టలేసుకునే కొంతమంది వ్యక్తులు ఇప్పుడు కొత్త రుచుల అన్వేషణలో తిరుగుతున్నారు. విస్తరిస్తున్న నగర సంస్కృతి, మారుతున్న యువత అభిరుచుల మధ్య టీ కొత్త సొగసులను సంతరించుకుని కవ్విస్తున్నది. ఉన్నత చదువులు చదువుకున్న యువత ఇప్పుడు కొత్తరకం కా న్సెప్ట్తో హోటళ్లను ప్రారంభిస్తున్నారు. మరోపక్క ఇరానీ చాయ్ రెస్టారెంట్లు ముఖ్యమైన కూడళ్లల్లో నవాబు దర్జాను అనుభవిస్తున్నాయి. రోడ్ సైడ్ కాకా హోటల్ నుంచి కేఫ్ కాఫీ డే ల వరకు పారిశ్రామికవాడలో రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.
ట్రెండ్ సెట్టర్లు యువతే.!
యువతరం అంటేనే ట్రెండ్ సెట్ చేసే వీరులు. వీరు తాగిందే చాయ్. కూర్చుందే టీ పాయింట్. వీరి అభిష్టాలకు గౌరవం ఇస్తూ కాన్సెప్ట్ టీ స్టాల్స్ వస్తున్నాయి. టీతోపాటు కాఫీ, మిల్క్‌షేక్స్‌తో, కూల్ కాఫీలు, వందవరకు రకాల చాయ్‌లతో వారిని ఆకట్టుకుంటున్నారు. దశాబ్దం క్రితం వరకు సాధారణ చాయ్, స్పెషల్ చాయ్‌లు మాత్రమే ఇక్కడి ప్రజలకు తెలుసు. ఇప్పుడు యువత నోటిపై 50రకాల చాయ్‌ల పేర్లు ఈజీగా వస్తున్నాయి. సాధారణ ప్రజలు చిన్నపాటి కాకా హోటళ్లలో, టీ స్టాల్స్‌లో చాయ్ అంటూ ఆర్డర్ ఇచ్చి తాగి వెళ్తుంటారు. కొంచెం ఇరానీ రుచి ఆస్వాదించాలనే వారు ఇరానీ కేఫ్‌లలో ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కట్లతో సంతృప్తి చెందుతారు. కానీ, యువతరం మాత్రం నచ్చిన చాయ్ తాగేందుకు బ్రాండెడ్ చాయ్ పాయింట్లకే వెళ్తున్నారు. మరోపక్క కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల కొనుగోలు శక్తిని గుర్తించి కార్పొరేట్ చాయ్ కేఫ్‌లు వెలుస్తున్నాయి. పటాన్చెరు, ఆర్సీపురం, పటాన్చెరు మండలంలో కేఫ్ కాఫీ డేలు, ఇతర అంతర్జాతీయ టీ, కాఫీ రుచులు అందజేసే కేఫ్‌లు వెళుస్తున్నాయి. దర్జాకు తగ్గట్టుగా ధరలు ఉంటున్నాయి. అయినా దేని క్రేజీ దానికే… రుచిని బట్టి, బడ్జెట్‌ను బట్టి ఆదరణలు. నూతనంగా ఏర్పాటవుతున్న కాన్సెప్ట్ కేఫ్‌లను అలంకరించేందుకు ఖర్చుకూడా బాగా పెడుతున్నారు. పని ఒత్తిడితో 10నిమిషాలు రిలాక్స్ అయ్యేందుకు ఉద్యోగులకు ఈ హోటళ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
చాయ్ తాగేందుకు రుద్రారం వస్తాం
చాయ్ తాగేందుకు రుద్రారంలోని టీ టైం కేఫ్‌కు వస్తాం. ఇక్కడ చాయ్ సూపర్‌గా ఉంటది. దోస్తులతో వస్తే కొంచెం సమయం కూర్చుని సరదాగా మాట్లాడుకుంటాం. చాయ్ మీద చాయ్ తాగుతూనే ఉంటాం. చాయ్ ఎక్కడ బాగుంటే అక్కడేకే వెళ్తాం.
ఆదరణ బాగుంది..
కర్ధనూర్‌లో టీ టైంను పెట్టి నెలరోజులే అవుతున్నది. ప్రజలు చక్కగా ఆదరిస్తున్నారు. 25రకాల చాయ్‌లు, కాఫీలు మా వద్ద లభిస్తున్నాయి. నేను ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసి ఉద్యోగం చేసేవాడిని. కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి ఏదైనా వ్యాపారం చేసుకోమని చెప్పారు. కొత్తగా ఉందని నా మిత్రుడితో కలిసి టీ టైంను ప్రారంభించాను. మేము ఊహించిన దానికన్నా రెట్టింపు రెస్పాన్స్ వచ్చింది. యువత ఆదరణ అద్భుతంగా ఉంది.
కొత్త రకం టీ పాయింట్లు..
లాక్డౌన్ తరువాత పటాన్చెరు నియోజకవర్గంలో శరవేగంగా కాన్సెప్ట్ హోటళ్లు ప్రారంభం అవుతున్నాయి. టీ టైం, డాక్టర్ టీ, ఫ్రెండ్ టీ, చాయ్ టైం, దోస్త్ టీ, ధమ్ చాయ్, ఇరానీ చాయ్ కేఫ్, కేరళ టీ స్టాల్, తమిళనాడు కాఫీ షాప్స్, కాక టీ, ఇర్ఫానీ చాయ్… ఇలా పాయింట్లు వెలుస్తున్నాయి. ప్రతి హోటల్లో భిన్నమైన రుచులతో చాయ్‌లు లభ్యం అవుతున్నాయి. కాక హోటళ్లలో టీ పొడి, పాలు, డికాషన్‌తో తయారు చేసే టీ మన ఇంట్లో ఉండే రుచిని పోలి ఉంటుంది. అదే మజా వస్తుంది. ఇరానీ టీ కొంచెం చిక్కగా, ధమ్ కావడంతో ఒక రకమైన మధురమైన రుచిలో జిహ్వకు ఆనందం కల్గిస్తున్నది. ఇప్పుడు తందూరి చాయ్లని నిప్పుల బట్టిలో మట్టిపాత్రలు వేసి వేడి చేస్తారు. వేడివేడి చాయ్ ఆ సలసలకాలే మట్టిపాత్రలో వేస్తే చాయ్ బుసలు కొడుతూ మట్టివాసనలతో ఘుమఘుమలాడుతుంది. మట్టి గ్లాసుల్లోనే ఈ టీ సహజ రుచిని ఇస్తుంది. ఇప్పుడు ప్రారంభమవుతున్న కాన్సెప్ట్ టీ హోటల్స్‌లో విభిన్నమైన రుచులతో కష్టమర్లను ఆకట్టుకుంటున్నారు. పలు బ్రాండ్ల ఓనర్లు ప్రాంచేజీలను ఇచ్చి అన్నిచోట్ల అదే రుచి ఉండేలా చూస్తున్నారు. దాదాపు 20నుంచి 40 రకాల చాయ్‌లు, కాఫీలు ఇక్కడ ఒకేచోట దొరికేలా చూస్తున్నారు. గ్రీన్ టీ, మసాల టీం, హనీ టీ, లెమన్ టీ, జింజర్ టీ, ఇమ్యూనిటీ టీ, బాదం టీం, బెల్లం టీ, కోల్డ్ టీ, ఐస్‌టీ, చాక్టెట్ టీ, ఉలాంగ్ టీ, పుదీన టీం, ఇలైచీ టీ ఇలా 40 రకాల టీలను వీరు అందజేస్తున్నారు. వీటితో పాటు కూల్ టీలు కూడా పదుల సంఖ్యలో లభ్యమవుతున్నాయి. కేరళ, రాజస్థాన్, తమిళనాడు వారి చాయ్ హోటల్స్‌లో మరిన్ని రకాల రుచులు లభ్యం అవుతున్నాయి. మలై చాయ్ అంటే నోరూరే వారూ ఎక్కువే.
చాయ్ కోసమే వస్తాం..
కర్ధనూర్‌లో పెట్టిన టీం టైం హోటల్లో చాయ్ తాగేందుకు ఫెండ్స్ అందరం వస్తుంటాం. ఘనపూర్ నుంచి దగ్గరలో ఇదే మంచి హోటల్ కావడంతో పాటు చాయ్ అద్భుతంగా ఉంటున్నది. నచ్చిన టేస్ట్లలో చాయ్‌లు దొరుకుతున్నాయి. మిల్క్‌షేక్‌లు కూడా ఇస్తున్నారు. మసాలా చాయ్ అయితే నాకు ఇష్టం. ఇక్కడికి వచ్చి చాయ్ తాగితే ఫ్రెష్‌నెస్ వస్తున్నది.
ఇరానీ చాయ్‌కు ఫుల్ డిమాండ్..
ఇరానీ చాయ్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. స్వచ్ఛమైన డెయిరీ పాలను కొనుగోలు చేసి ఇరానీ చాయ్‌ను తయారు చేస్తున్నం. ప్రజలు ఇరానీ చాయ్ తాగిన తరువాత ఎంతో సంతోష పడుతుంటారు. ఇతర రాష్ర్టాలనుంచి వస్తున్న ప్రయాణికులు మా ఇరానీ చాయ్‌ను రుచి చూసి అమితమైన ఆనందంతో మరో చాయ్ తెప్పించుకుని తాగుతుంటారు. ఇరానీ చాయ్‌తో పాటు ఉస్మానియా బిస్కట్స్‌ను తినేందుకు యూత్ ఆసక్తి చూపుతున్నరు. చాయ్ క్వాలిటీ దెబ్బతినకుండా మాస్టర్లకు సూచనలు ఇస్తాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, సినిమా నటులు మా వద్ద ఆగి ఇరానీ చాయ్ తాగి వెళ్తుంటారు. – మధుసూదన్‌రెడ్డి, సిల్వర్ బవార్చీ హోటల్ నిర్వాహకులు, ముత్తంగి