వ్యవసాయరంగానికి వెన్నెముకైన సహకార సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడంతో పాటు రైతాంగానికి అవసరమైన వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు నాబార్డు నిధులు మంజూరు చేసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గోదాంలు, ఎరువుల దుకాణాలు, వే బ్రిడ్జిలు, పప్పు, వరిధాన్యం మిల్లులు, వ్యవసాయ పనిముట్ల, రవాణా వాహనాల కొనుగోలు తదితర పనుల కోసం రూ.11,24,43,760 కోట్లను కేటాయించింది. ముఖ్యంగా సరైన మద్దతు ధర వచ్చేంత వరకు రైతులు పండించిన పంటలను నిల్వ చేసుకునేలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 గోదాంల నిర్మాణానికి రూ.6,47,41,800 కోట్లు ఖర్చుచేయనున్నది. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమై మొదటి దశలో కొనసాగుతుండగా, ఈ నిధులను డీసీసీబీ ద్వారా సహకార సంఘాలకు 90శాతం బ్యాంకు రుణం, 10శాతం మార్జిన్ మనీ రూపంలో అందించనున్నది.
సంగారెడ్డి, అక్టోబర్ 29 : సహకార సంఘాల బలోపేతానికి నాబార్డు సహాయంతో వ్యవసాయ రంగానికి ఉపయోగపడే నిర్మాణాలు చేపడుతున్నది. ఇందుకోసం నాబార్డు నుంచి రూ.11,24,43,760 కోట్ల నిధులు మంజూరు చేసింది.ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు, మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్న నాబార్డు సహకార సంఘాలకు నిధులు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నది. ఈ నిధులు 90శాతం బ్యాంకు రుణం, 10 శాతం మార్జిన్ మనీ రూపంలో సహకార బ్యాంకులకు అందనున్నది. రైతులు పండించిన ధాన్యానికి ధరలు వచ్చేంత వరకు నిల్వ కోసం గోదాంల నిర్మాణాలకు ప్రాధాన్యం కల్పిస్తూ రూ.6,47,41,800 కోట్లను కేటాయించింది. వానకాలం, యాసంగి పంటలు వేసే ముందు అన్నదాతలు ఎరువుల కోసం దుకాణాల చుట్టూ తిరుగకుండా సహకార సంఘం పరిధిలో దుకాణాల నిర్మాణాలకు రూ.2,71,25,000కోట్ల నిధులు ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. ఇతర యూనిట్లను నెలకొల్పేందుకు రూ.2,05,76,960 కోట్లను ఖర్చుచేసేందుకు సహకార కేంద్ర బ్యాంకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు తూకం యం త్రం, మినీ దాల్ మిల్, వరి ధాన్యం కొనుగోలు కేంద్రం యూనిట్, వ్యవసాయానికి ఉపయోగపడే యూ నిట్, రవాణా వాహనం ఏర్పాటుకు నిధులు ఖర్చుచేయనున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర వచ్చే వరకు గోదాంలో నిల్వ చేసుకునే సౌకర్యంతో లబ్ధిచేకూరనున్నది. సహకార పరపతి సంఘాల్లో రుణాలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇవ్వడంతో సహకార బ్యాంకుల లావాదేవీలు పెరిగిపోవడంతో లాభాలబాట పట్టాయి.
గోదాంలకు అధిక ప్రాధాన్యం..
నాబార్డు సహకారంతో ఉమ్మడి రైతాంగానికి అవసరమైన నిర్మాణాలు, ఎరువుల దుకాణాలు, వే బ్రిడ్జిలు ఇతర యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేకంగా గోదాంలపై దృష్టి పెట్టడం శుభపరిణామం. వ్యాపారుల మోసాలకు చెక్ పెట్టేందుకు నాబార్డు సంస్థ గోదాంలు, ఇతర వ్యవసాయ రంగానికి ఉపయోగపడే దుకాణాలు, యూనిట్లను నెలకొల్పేందుకు నిధులు వెచ్చిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 14 గోదాంల నిర్మాణాలకు రూ. 6,47,41,800 కోట్లు మంజూరు చేసింది. వ్యవసాయ రంగానికి ఉపయోగపడే 10 దుకాణాల నిర్మాణాలకు రూ. 2,71,25,000 కోట్లు, 3 వే బ్రిడ్జిలకు రూ.52.50లక్షలు, పప్పు మిల్లుకు రూ.17లక్షలు, ధాన్యం మిల్లుకు రూ. 77,76,960 లక్షలు, రవాణా వాహనానికి రూ.7.50లక్షలు, వ్యవసాయ పనిముట్ల యూనిట్‌కు రూ.51 లక్షల నిధులను నాబార్డు సంస్థ రుణ రూపంలో మంజూరు చేసింది. ఝరాసంగం, నర్సాపూర్‌లలో టెక్నికల్ ప్రాసెస్‌లో ఉన్నందున వాటి పనులు ప్రారంభించలేదని అధికారుల సమాచారం. మిగతా గోదాంల నిర్మాణ పనులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమై మొదటి దశలో కొనసాగుతున్నాయి…
జిల్లాల వారీగా యూనిట్లు..
సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ సహకార సం ఘాల పరిధిలో ఉన్న బ్యాంకులను బలోపేతం చేస్తూ అన్నదాతలకు మెరుగైన సేవలు అందించేందుకు నాబార్డు సంస్థ ముందుకు వచ్చింది. సహకార బ్యాంకులు వ్యవసాయ పంట రుణాలు, మహిళా సంఘాల సభ్యులకు అప్పులు ఇస్తూ కార్పొరేట్ బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. సిద్దిపేటలో జిల్లాలో గజ్వేల్, వర్గల్, కాన్గల్, మిరుదొడ్డి ప్రాంతాల్లో 1050 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 2 గోదాంల నిర్మాణాలకు రూ.69,39,400 లక్షలు, వ్యవసాయ రంగ పనిముట్లు, ఎరువుల దుకాణాలకు రూ.54.81 లక్షలు కేటాయించారు.
సంగారెడ్డి జిల్లాలో…
సంగారెడ్డి జిల్లాలో 12 యూనిట్లకు రూ.4,06,95,000 కోట్లను విడుదల చేశారు. ఝరాసంగం మండలంలో 5 యూనిట్లు, పుల్కకల్లో 2 యూనిట్లు, హత్నూరలో రెండు యూనిట్లు, హద్నూరలో వరి ధాన్యం మిల్లు, రవాణా వాహనాల ఏర్పాటుకు నిధులు ఖర్చుచేయనున్నది. ఇందులో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 4 గోదాంలకు రూ.1,72,15,000 కోట్ల నిధులు, 4 దుకాణాలకు రూ.1,41,80,000 కోట్లు, ఒక పప్పు మిల్లు, వే బ్రిడ్జి, వరి ధాన్యం మిల్లు, రవాణా వాహనాలకు రూ.93లక్షల నిధులు కేటాయించారు.
మెదక్ జిల్లాలో…
మెదక్ జిల్లాలో 14 యూనిట్లను నెలకొల్పేందుకు రూ.5,93,28,360 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో వెల్దుర్తి మండలంలో 6 యూనిట్లు, టేక్మాల్‌లో 3 యూనిట్లు, జంగరాయిలో ఒకటి, నర్సాపూర్‌లో 2 యూనిట్లు, కొత్తపల్లి, నార్సింగిలో ఒకటి చొప్పున యూ నిట్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. 6150 మెట్రిక్ టన్నుల సామర్థ్యంల గల గోదాంలకు రూ.4,05,87,400 కోట్ల నిధులు, 3 దుకాణాలకు రూ.74.64 లక్షలు, రెండు వే బ్రిడ్జిలకు రూ.35లక్షలు, వరి ధాన్యం మిల్లుకు రూ.77,76,960 లక్షల నిధులను నాబార్డు సంస్థ నుంచి రుణాల రూపంలో 10శాతం మార్జిన్ మనీతో సహకార సంఘాల బ్యాంకులకు రుణాలు ఇచ్చి అభివృద్ధికి బాటలు వేస్తున్నది.
వ్యాపారాలకు సహకార రుణాలు
సహకార బ్యాంకు సేవలు సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాం. స్వయం సహాయ మహిళా సంఘాలు, ఇతర వాణిజ్య, వ్యాపార రుణాలు వినియోగదారులకు ఇస్తున్నాం. ఇటీవల జరిగిన జిల్లా సహకార బ్యాంకు సమావేశంలో రూ.25 కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాం. రైతులకు అవసరమైన ఎరువులు, వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసేందుకు గ్రామాలకు సమీపంలో దుకాణసముదాయాలు, సహకార సంఘాల భవనాలను నిర్మిస్తున్నాం. రాష్ట్రంలోని డీసీసీబీ బ్యాంకుల కన్నా రుణాల శాతం పెంచేందుకు జిల్లా బ్యాంకు ముందున్నది. కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా వాహనాలు, గృహోపకర, బంగారు ఆభరణాల రుణాలు, ఎడ్యుకేషన్ రుణాలు సహకార బ్యాంకులతో రైతులు, విద్యార్థులు, మహిళలు, ఖాతాదారులు తీసుకుని సకాలంలో చెల్లించి డీసీసీబీ సేవలను విస్తృతం చేసేందుకు అన్నివర్గాలు సహకరించాలి.