సంగారెడ్డి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : పోడుభూములు సాగు చేస్తున్న వారికి హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అటవీభూములను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి జీవనోపాధి చూపించడంతో పాటు అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోనున్నారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పోడుభూములను క్రమబద్ధీకరించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భూముల గుర్తింపు, కబ్జాదారుల నుంచి అర్జీల స్వీకరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదివారం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సమావేశంలో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డితో, అటవీశాఖ, గిరిజన శాఖ, పంచాయతీ అధికారులు పాల్గొననున్నారు. మంత్రి హరీశ్‌రావు భూముల క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధేశం చేయనున్నారు. అటవీభూముల్లో చెట్లను తొలిగించి ఏండ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. అయితే, వీరికి ఆ భూములపై ఎలాంటి హక్కులు లేవు. తమకు భూ యాజమాన్య హక్కులు కల్పించాలని గిరిజనులు, ఇతరులు ఏండ్లుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని హామీనివ్వడంతో వారికి హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. రెవె న్యూ, అటవీశాఖ అధికారులు గ్రామాల వారీగా పోడుభూముల వివరాలు, సాగు చేస్తున్న వారి వివరాలను సేకరించి అర్హులకు మాత్రమే భూ యాజమాన్య హక్కు లు కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 2958 ఎకరాల పోడుభూములు
రాష్ట్రంలోని ఇతర జిల్లాలో పోలిస్తే సంగారెడ్డి జిల్లాలో పోడుభూములను సాగు చేస్తున్నవారి సంఖ్య తక్కువగా ఉంది. రెవెన్యూ, అటవీశాఖ అధికారుల వివరాల ప్రకా రం సంగారెడ్డి జిల్లాలోని పది మండలాల పరిధిల్లోని 37 గ్రామ పంచాయతీల్లో 2958 ఎకరాల పోడుభూములను 1501 మంది గిరిజనులు, ఇతరులు సాగు చేసుకుంటున్నారు. నారాయణఖేడ్, అం దోలు నియోజకవర్గాల్లో ఎక్కువ మంది రైతులు ఉన్నా రు. వీరంతా చాలా కాలంగా తాము సాగు చేస్తున్న భూములకు సంబంధించి హక్కులు కల్పించాలని, పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వం పోడు భూములను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకోవటం, ఆ దిశగా అడుగులు వేస్తుండడంతో గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ తాము సాగు చేసుకుంటున్న పంటపొలాలకు పట్టాలు ఇప్పిస్తారని సంబురపడుతున్నారు.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక కమిటీలు
పోడుభూముల సమస్యలను పరిష్కరించి వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో కమిటీలు వేస్తున్నది. ఈ కమిటీలు పోడు భూములు, వాటిని సాగు చేస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నాయి. గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ, సర్వే సిబ్బందితో గ్రామ కమిటీ.. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, ఎంపీవో, సర్వేయర్, ఫారెస్టు సెక్షన్ అధికారితో మండల కమిటీ.. డివిజన్ స్థాయిలో ఆర్డీవో, ఫారెస్టు రేంజ్ అధికారి, డీఎల్పీవో, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి, సర్వే అధికారితో డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి, డీఎఫ్‌వో, డీపీవో, జడ్పీ సీఈవోతో కమిటీ వేయడం జరుగుతున్నది. గ్రామ, మండల స్థాయి కమిటీ అధికారులకు ఆదివారం సంగారెడ్డిలో పోడుభూముల క్రమబద్ధీకరణకు సంబంధించి అవగాహన కల్పించారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయి కమిటీల్లోని అధికారులంతా 37 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఆ తర్వాత సోమవారం నుంచి అర్జీలు స్వీకరిస్తారు. పోడుభూములను సాగుచేస్తున్న వారికి భూ యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఏర్పాటు చేయనున్న అటవీహక్కుల కమిటీల్లో గ్రామ సర్పంచ్‌లు, గిరిజన ఎంపీటీసీలు, గిరిజన జడ్పీటీసీలు సభ్యులుగా ఉండనున్నారు.
రేపటి నుంచి ఆర్వోఎఫ్ఆర్ చట్టాలపై అవగాహన
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 6 : సంగారెడ్డి జిల్లాలో ఆర్వోఫ్‌ఆర్ చట్టాలపై అవగాహన, దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచి ప్రారంభిస్తున్నామని కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. పోడు, అటవీ భూముల సంరక్షణ, పోడు భూముల దరఖాస్తుల స్వీకరణ అంశాలపై శనివారం కలెక్టరేట్లో జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ ఆర్వోఎఫ్ఆర్ పట్టా దరఖాస్తులపై అవగాహన కల్పించి, పోడు భూముల దరఖాస్తులను రేపటి నుంచి స్వీకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోడు భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 10 మండలాల్లో 37 గ్రామ పంచాయతీలు, 37 హ్యాబిటేషన్లలో 2,958 ఎకరాల భూమిలో 1501 మంది ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్, వీఆర్ఏ, అటవీ బీట్ అధికారి, పంచాయతీ కార్యదర్శి బృందంగా ఏర్పడి పోడుభూమి సమస్యలపై అవగాహన కల్పించాలన్నారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 31 కంటే ముందు నుంచి సాగు చేసుకునే వారికి హక్కులు సంక్రమిస్తాయని పేర్కొన్నారు. 2006 జనవరి 1 నుంచి ఆక్రమణలో ఉన్నవారు అర్హులు కారని స్పష్టం చేశారు. దరఖాస్తులను జాగ్రత్తగా వినియోగించాలని, జవాబుదారీతనంగా ఉం డాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆయా శాఖల అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.