ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావాలంటే చేయి తడపనిదే పైలు ముందుకు కదలని పరిస్థితి ఉండేది. అవినీతిపై ప్రజల్లో చైతన్యం, అవగాహన పెరగడంతో కేసుల నమోదు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 3 కేసుల్లో అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులు పట్టుబడగా, ఈ సంవత్సరంలో కేవలం మూడు కేసులు నమోదు కావడం విశేషం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 2015లో 16 అవినీతి కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా 2017లో కేవలం 2 కేసులు నమోదు కాగా, 2020, 2021లో 3 కేసుల చొప్పున అవినీతి అధికారులపై అవినీతి నిరోధకశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. దీనిని బట్టి చూస్తే ప్రజల్లో పెరిగిన చైతన్యం పెరిగినట్లు తెలుస్తున్నది. లంచాలు ఇవ్వకుండా పనులు చేసుకునేందుకు నేటితరం ఇష్టపడుతున్నారు.
సంగారెడ్డి/ మెదక్, డిసెంబర్ 2 : అవినీతిని అంతమొందించేందుకు అవినీతి నిరోధకశాఖ అధికారులు ఏటా ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది కరోనా-19 కారణంగా విద్యార్థుల ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు లంచగొండితనంతో ప్రజలను విసిగించి డబ్బులు డిమాండ్ చేయడం, ముందుగా ముట్టజేబితే కానీ, పని చేయని సందర్భాలకు విసిగిపోయిన బాధితులు అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఏసీబీ సాయంతో లంచగొండులను భరతం పడుతున్నారు. గతేడాది రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న అధికారులే ఎక్కువగా ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారు. వీఆర్వోల నుంచి తహసీల్దార్లు, అదనపు కలెక్టర్ స్థాయి అధికారులు పట్టుబడ్డ విషయం తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే అధికారులు కూడా అవినీతి కేసుల్లో పట్టుబడ్డ సంఘటనలు ఉన్నాయి. లంచం అనే పదం కార్యాలయాల్లో వినబడకుండా చేయడానికి అవినీతి నిరోధకశాఖ అధికారులు ఏటా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు, ప్రధాన కూడళ్ల్లలో ప్రజలకు కరపత్రాలు, గోడలకు స్టిక్కర్లు అతికిస్తూ చైతన్యం కల్పిస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నమోదైన కేసుల వివరాలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏడేండ్ల కాలంలో అత్యధికంగా రెవెన్యూశాఖలో 17 కేసులు, విద్యాశాఖ-3, పరిశ్రమల శాఖ-1,పంచాయతీ శాఖ-6, అటవీ శాఖ-3, పశుసంవర్ధక శాఖ-1, ఆరోగ్యశాఖ-6, ఫ్యాక్టరీస్‌లో-1, మున్సిపల్ శాఖలో-2, ఆర్టీవో శాఖ-1, కోశాధికారిశాఖ-1, విద్యుత్‌శాఖ-2, సర్వేల్యాండ్ శాఖ-1, న్యాయశాఖ-1 చొప్పున అవినీతి కేసులు నమోదైనట్లు ఏసీబీ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. 2015లో 16 కేసులు, 2016-6, 2017-2,2018-7, 2019-9, 2020-3, 2021-3 కేసులు నమోదయ్యాయి.
వారోత్సవాల షెడ్యూల్..
అవినీతి నిరోధక చట్టం…
ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం పలు శాఖల్లో, కార్యాలయాల్లో అక్రమాలను రూపుమాపేందుకు అవినీతి అధికారులను పట్టించేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇదే అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) 1968లో అవినీతి నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఏసీబీ అధికారులు వివిధ శాఖల్లో విధులు నిర్వహించే అధికారుల వివరాలను సుమోటోగా స్వీకరించొచ్చు. లంచం తీసుకున్న అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేస్తారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ప్రభుత్వ అధికారులపై, ఇతరులపై విచారణ జరిపేందుకు అధికారాలున్నాయి. అవినీతి అధికారులు నగదును డిమాండ్ చేయడమే కాదు వస్తు, స్థిరాస్తి రూపేనా డిమాండ్ చేసినా అవినీతి నిరోధక చట్టం కిందకు వస్తాయి.
అందుబాటులోకి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం..
అవినీతి, అక్రమాలపై యుద్ధం ప్రకటిస్తే తప్పా అది తగ్గేది కాదు. సాక్ష్యాధారాలతో పట్టించేందుకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. లంచం డిమాండ్ చేసిన అధికారి, అతడి సహాయకుడిని పట్టించేందుకు సులువైన మార్గం సెల్‌ఫోన్‌తో సాధ్యపడుతుంది. జీపీఆర్ఎస్ వ్యవస్థ ఉన్న మొబైల్ ఫోన్లో సంభాషణను రికార్డు చేయొచ్చు. సంభాషణలు, దృశ్యాలు రెండూ కావాలంటే పెన్ను ఆకారంలో ఉండే కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుం డా 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. ఈ నంబర్ హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయంలో ఉంటుంది. అక్కడి నుంచి ఉమ్మడి 10 జిల్లాలోని ఏసీబీ డీఎస్పీ స్థాయి అధికారి లేదా కార్యాలయానికి సమాచారం అందుతుంది.
లంచమడిగితే సమాచామివ్వండి…
ఎక్కడైనా, ఎవరైనా అవినీతికి పాల్పడితే సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఫిర్యాదుదారులు స్వయంగా లేక ఫోన్ ద్వారా సంప్రదించినా తగు చర్యలు తీసుకుంటాం. 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలుపొచ్చు. లంచం అడిగినా నేరమే ఇచ్చినా నేరమే. లంచం తీసుకున్న వారిపై ఎలాంటి కేసు నమోదవుతుందో, ఇచ్చిన వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ విషయం గుర్తించి లంచాన్ని పూర్తిగా రూపుమాపేందుకు ప్రజలు సహకరించాలి. అవినీతిని నిర్మూలించించేందుకు ప్రజల్లో చైతన్యం రావాలి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఏడాది కేసులు తగ్గాయి. కరోనా-19తో ఈసారి వారోత్సవాల సందర్భంగా ఎలాంటి ర్యాలీలు, సదస్సులు, చర్చాగోష్టిలు నిర్వహించడం లేదు.