ములుగు, జూలై 22(నమస్తేతెలంగాణ) : ములుగులోని సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వైస్ చాన్స్‌లర్ వైఎల్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. జాతీయ విద్యావిధానంలో భాగమైన సీయూఈటీ, జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్టు చెప్పారు. ఐఐటీ హైదరాబాద్ సహకారంతో బీటెక్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నాలుగేండ్ల కోర్సులో 30 సీట్లు, బీఎస్సీ హానర్స్, కంప్యూటర్ సైన్స్, డాటా అనాలిటిక్స్ నాలుగు సంవత్సరాల కోర్సులో 25 సీట్లు, బీఎస్సీ హానర్స్ గణితం, కంప్యూటర్ నాలుగేళ్ల కోర్సులో 25 సీట్లు, బీఏ హానర్స్ ఇంగ్లిష్ నాలుగేండ్ల కోర్సులో 25 సీట్లు, బీఏ హానర్స్ ఎకనామిక్స్ నాలుగు సంవత్సరాల కోర్సులో 25 సీట్లు ఉన్నాయని తెలిపారు.
నేటి నుంచి ఆన్లైన్లో ఆగస్టు 3 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని, 5వ తేదీన మెరిట్‌లిస్ట్ ప్రకటించి, 11వ తేదీన కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు. మొత్తం 130 సీట్లలో జనరల్ కోటాలో 48, ఈడబ్ల్యూఎస్‌లో 15, ఓబీసీ కోటాలో 36, ఎస్సీ కోటాలో 21, ఎస్టీ కోటాలో 12 సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.