ముంబై: డ్రగ్స్ కేసులో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ ఆఫీసర్ సమీర్ వాంఖడే (Sameer Wankhede) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్యన్‌పై కేసు పెట్టకుండా ఉండేందుకు ఆ ఆఫీసర్ 25 కోట్ల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విజిలెన్స్ శాఖ తన దర్యాప్తు రిపోర్టును రిలీజ్ చేసింది. ముంబైలో ఎన్సీబీ ఆఫీసర్‌గా ఉన్న సమీర్ వాంఖడే అక్రమరీతిలో సంపాదించినట్లు గుర్తించింది. ముంబైలో అతనికి నాలుగు ఫ్లాట్లు ఉన్నాయని, ఓ రోలెక్స్ వాచీ కూడా ఉన్నట్లు రిపోర్టులో తేల్చారు.
ఆర్యన్ ఖాన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్ పేర్లను చివరి నిమిషంలో కలిపినట్లు ఎన్సీబీ విజిలెన్స్ రిపోర్టు పేర్కొన్నది. కొందరు అనుమానితు పేర్లను తొలగించినట్లు వెల్లడించారు. ఆఫీసర్ సమీర్ వాంఖడే 2017 నుంచి 2021 వరకు ఆరు విదేశీ ట్రిప్‌లు వెళ్లినట్లు గుర్తించారు. బ్రిటన్, ఐర్లాండ్, పోర్చుగల్, సౌతాఫ్రికా, మాల్దీవులకు వెళ్లినట్లు పసికట్టారు. 55 రోజుల పాటు ఆయన అక్కడ ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు.
సమీర్ వద్ద ఖరీదైన వాచీలు ఉన్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. 22 లక్షల ఖరీదైన రోలెక్స్ వాచీని అతను 17 లక్షలకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి కంటే ముందే రెండు కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో స్పష్టంగా తెలియదు.