భగవంతుడి సృష్టిలో లేదు భేదం.భగవానుడి దృష్టిలో అంతా సమభావం.సమాజంలో నెలకొన్న భేద భావాలను రూపుమాపి, సమానత్వాన్ని చాటిన యతి శేఖరులు, విశిష్టాద్వైత సిద్ధాంత కర్త భగవత్ రామానుజాచార్యులు.వెయ్యేండ్లకు పూర్వం సాంప్రదాయికంగా కొనసాగుతున్న వ్యవహారాలు.. ఛాందసంగా మారిసామాజిక పురోగతికి అడ్డురాకుండా వాటిని మాన్పటమో, మార్చటమో చేయడం ఆచార్యుల ప్రథమ కర్తవ్యమని బోధించారు. సమాజంలో చైతన్యం నింపి, సమానత్వ స్ఫూర్తిని చాటారు. ఆ మహనీయుని సమతా మూర్తి ప్రతిష్ఠితం అవుతున్న సందర్భంగా.. రామానుజుల గాథలు మననం చేసుకుందాం.
దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవరికీ లేదు. దేవుడి ముందు అందరూ సమానమే. కుల, మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం అంటూ శాస్ర్తాలు చెప్పిన విషయాల్లోని అంతరార్థాన్ని విడమర్చి, విశ్లేషించి సర్వమానవ సమానత్వమే దైవత్వమని చాటిచెప్పిన ఆధ్యాత్మిక విప్లవమూర్తి శ్రీమత్ రామానుజాచార్యులు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుడిపై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణ. అస్పృశ్యత లాంటి దురాచారాలను తొలగించడానికి సంస్కరణాత్మక పద్ధతులను ప్రవేశపెట్టారు.
తిరుమల వైభవానికి పునాది
రామానుజులు ఆసేతు శీతాచల పర్యంతం పర్యటించి అనేక దేవాలయాల్ని పునరుద్ధరించారు. వాటిలో ఉత్తమ పూజ, నిర్వహణ వ్యవస్థల్ని ఏర్పాటుచేశారు. విష్ణుభక్తులందరూ వైష్ణవులేనని ఉద్బోధించారు. శ్రీరంగనాథుని దేవాలయ పూజావిధానాలు సంస్కరించి కొన్ని ముఖ్య పద్ధతులు ప్రవేశపెట్టారు. అంతేకాదు తిరుపతి, కాంచీపురం తదితర వైష్ణవాలయాల్లో ఆచారాలు, పూజా విధానాలు ప్రవేశపెట్టారు.
తిరుమలలో శ్రీనివాసుడి మూలవిరాట్ విష్ణుమూర్తి విగ్రహం కాదని, అది శివుడు లేదా అమ్మవారి విగ్రహం కావచ్చనే వాదన చెలరేగింది. చిలికి చిలికి గాలివానగా మారి, ఈ వాదన చివరికి శైవ, వైష్ణవ కలహాలకు దారి తీసింది. విషయం తెలుసుకున్న రామానుజులు తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు దగ్గరికి వెళ్లారు. పౌరాణిక, శాస్త్ర ఆధారాలు చూపించి తన వాదనతో తిరుమలలో ఉన్నది శ్రీవారి విగ్రహమేనని నిరూపించారు. శైవులు అంతటితో సంతృప్తి చెందలేదు. ప్రత్యక్ష ప్రమాణం కావాలన్నారు.
అందుకు అంగీకరించిన రామానుజులు వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలు, శైవాయుధాలు, శక్తి ఆయుధాలు పెట్టి, విగ్రహం ఏ దైవానిదైతే ఆ ఆయుధాలను దైవం స్వీకరిస్తుందని చెప్పి గర్భాలయం తలుపులు మూసేశారు. ఆ రాత్రి అత్యంత కట్టుదిట్టాల నడుమ గడవగా తెల్లవారి తలుపులు తెరిస్తే ధ్రువబేరానికి శంఖు చక్రాలు ఆయుధాలుగా కనిపించాయి. దీంతో తిరుమలలో ఉన్నది శ్రీనివాసుడి మూలవిరాట్ మాత్రమే అని అందరూ అంగీకరించారు. తర్వాతి కాలంలో తిరుమలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు రామానుజులు ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. ఇదే జియ్యర్ల వ్యవస్థగా పరిణమించి స్థిరపడటంలోనూ రామానుజుల పాత్ర కీలకం. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది ఆయనే. ఆ ఆలయం చుట్టూ ప్రాంతాన్ని పూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి యాదవరాజు తన గురువైన రామానుజుల పేరిట రామానుజపురంగా రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది.
అందరికోసం ఒక్కడు
రామానుజులు కాంచీపురంలో యాదవ ప్రకాశుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. కొన్ని సందర్భాల్లో గురువుతోనే విభేదించి, తన వాదంతో వారిని మెప్పించేవారు. ఇతర విద్యార్థులకు భిన్నంగా, తార్కిక దృష్టితో ప్రతి విషయాన్నీ పరిశీలించేవారు. ఆయన దృక్పథమే భవిష్యత్తులో భక్తి ఉద్యమం రూపంలో కోట్లాది హృదయాల్లో ఆధ్యాత్మిక జ్యోతిని ప్రదీప్తం చేస్తుందని ఆ క్షణంలో ఎవరూ ఊహించలేదు. కానీ, ఆయనదొక విలక్షణ శైలి. గోష్ఠీపూర్ణుడనే పేరుతో ప్రసిద్ధి పొందిన తిరుక్కోట్టి నంబియార్ రామానుజులకు తిరుమంత్రాన్ని ఉపదేశించారు. అది చాలా రహస్యమైందనీ, ఎవరికీ చెప్పవద్దనీ, మంత్రం బయటకు పొక్కితే దుష్ఫలితాలు కలుగుతాయనీ గోష్ఠీపూర్ణులు.. రామానుజులకు చెప్పారు. ‘వేలాది జీవితాలు తరిస్తాయంటే నేనొక్కడినీ ఏమైనా ఫర్వాలేదు. ఎటువంటి దుష్ఫలితాలు వచ్చినా స్వీకరిస్తాను’ అంటూ అక్కడి ఆలయగోపురం ఎక్కి ప్రజలందరికీ తిరుమంత్రాన్ని ఉపదేశించారు. సమాజ ఉద్ధరణ కోసం పరితపించే నిజమైన భక్తులు రామానుజులు.
విశిష్టాద్వైత ప్రచారం
పరమాత్మ ఒక్కడే. ఆయన సాకారుడు. ఆ రూపం నారాయణ రూపం. జీవాత్మ, పరమాత్మ వేర్వేరు. పరమాత్మను చేరుకోవడమే మోక్షం అనేవి విశిష్టాద్వైతంలోని ముఖ్య భావనలు. నిజానికి ఇవి రామానుజాచార్యుల కన్నా పూర్వం నుంచే ప్రచారంలో ఉన్నాయి. కానీ, వాటిని మరింత మెరుగుపరచి, విస్తృతమైన ప్రచారంలోకి తీసుకువచ్చారాయన. అందుకనే విశిష్టాద్వైత సిద్ధాంత పితామహుడిగా ఖ్యాతి పొందారు. ఈ సిద్ధాంతానికి మరింత బలం కల్పించేందుకు వేదాంత సంగ్రహం, శ్రీభాష్యం (బ్రహ్మసూత్రాలకు భాష్యం), భగవద్గీత భాష్యం, వేదాంత సారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం తదితర రచనలు చేశారు. రచనలు, ప్రచారంతో పాటు తన తర్కంతో అప్పటి పండితులందరినీ ఓడించి విశిష్టాద్వైత విజయపతాకం ఎగురవేశారు.
సంస్కరణ వాది
రామానుజుల కాలం నాటికి సామాజిక పరిస్థితిలో శైవ, వైష్ణవ కలహాలు విపరీతంగా ఉండేవి. ఒకరిపై ఒకరు విద్వేషాలు నింపుకొనే వారు. మరోపక్క నిమ్నవర్గాలకు ఆలయ ప్రవేశమే లేని కాలమది. అలాంటి కాలంలో వైష్ణవ తత్త్వాన్ని దేదీప్యమానంగా వెలిగించిన మహా పురుషుడు రామానుజులు. కులం, మతం పేరిట ప్రజల్లో వైషమ్యాల పోరు నడుస్తున్న సమయంలో విశిష్టాద్వైతం ప్రబోధించి సంఘ సంస్కర్తగా నిలిచారు. మానవులందరూ సమానమే అనే సర్వమానవ సమభావ సిద్ధాంతం ప్రతిపాదించారు. అప్పటి పరిస్థితుల్లో అదొక పెద్ద విప్లవం. దళితులను ఆలయ ప్రవేశం చేయించారు. అన్నివర్గాల వారికీ ఆలయ వ్యవస్థలో భాగం కల్పించారు. ఆయన శిష్యులలో చాలామంది నిమ్న వర్గాల వారే కావటం ఇందుకు నిదర్శనం.