Heroine | సాధారణంగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీలకు సంబంధించిన తప్పిదాల గురించి ఈ మధ్య బాగా వింటున్నాం. అయితే తాజాగా ఓ కోలీవుడ్ హీరోయిన్‌కి తాను జీవితంలో ఎప్పుడూ తినని వంటకాన్ని తినిపించేలా చేసిన ఘటన కలకలం రేపుతోంది. పాపులర్ తమిళ నటి సాక్షి అగర్వాల్ స్విగ్గీ ఆర్డర్లో ఎదురైన అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.సాక్షి ఇటీవల పన్నీర్ బిర్యానీ తినాలనుకొని ఒక ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆర్డర్ చేసింది. అయితే రెస్టారెంట్ నిర్లక్ష్యం వల్ల ఆమెకు పన్నీర్ బదులుగా చికెన్ బిర్యానీ డెలివరీ అయ్యింది. తాను ఎంతో ఆకలితో ఉన్న సమయంలో, అది పన్నీర్ అనుకుని తినడం మొదలుపెట్టిన సాక్షి… సగం తిన్న తర్వాత అసలైన నిజం గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆమె..నా జీవితంలో ఎప్పుడూ నాన్ వెజ్ తినలేదు. కానీ ఈ తప్పిదం వల్ల నాకు చికెన్ తినిపించేశారు. ఇది చాలా బాధాకరం అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ ఘటనపై సాక్షికి అనేక మంది అభిమానులు సానుభూతి తెలుపుతున్నారు. “అయ్యో ఎంత దురదృష్టం!”, “ఇలాంటి తప్పులు ఇటీవల బాగా జరుగుతున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సాక్షి చేసిన పోస్ట్ మాత్రం నెట్టింట వైరల్ అయింది. ఇక సాక్షి అగర్వాల్ తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ‘రాజా రాణి’ సినిమాలో అతిథి పాత్రతో తెరంగేట్రం చేసిన ఆమె, తమిళంతో పాటు కన్నడ, మలయాళ చిత్రాలలోనూ నటించింది.
2019లో ‘బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 3’లో పాల్గొన్న ఆమె 49వ రోజున హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. తాజాగా “బెస్ట్”, “ఫైర్”, “ది కేస్ డైరీ” వంటి మలయాళ సినిమాలలో నటిస్తూ, వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపిస్తోంది. ఏది ఏమైన కూడా ఫుడ్ డెలివరీ సంస్థలు నాణ్యతపై మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్న విషయాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా ఫుడ్ డెలివరీ చేసే వారి అశ్రద్ధకు బలి కావల్సిందేనా?