OG | పవన్ కళ్యాణ్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓజీ’ విడుదలకు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ జోరుగా సాగుతుండగా, ప్రత్యేక జీవోలు జారీ చేసిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించాయి. అదనపు షోలు వేసుకునేందుకు కూడా అనుమతి లభించింది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా అర్ధరాత్రి 1 గంటకు మాత్రమే బెనిఫిట్ షోలు నిర్వహించడానికి అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం, నిర్మాతల అభ్యర్థన మేరకు వెసులుబాటు కల్పించింది.
తాజా ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలు వేయడానికి అనుమతి ఇచ్చింది. అయితే టికెట్ ధరలు, సాధారణ షోల విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ముందే సడలింపులు ఇచ్చింది. రేవంత్ రెడ్డి సర్కారు రాత్రి 9 గంటలకు ప్రీమియర్లు నిర్వహించుకోవడానికి అనుమతిచ్చింది. టికెట్ రేట్ల విషయానికి వస్తే ఏపీలో తెలంగాణ కంటే ఎక్కువ పెంచడం జరిగింది. ఏపీలో ప్రీమియర్ షో టికెట్ రేటు జీఎస్టీతో కలిపి రూ.1000 చేయగా, తెలంగాణలో మాత్రం రూ.800 హైక్ మాత్రమే అనుమతించారు. అదనంగా ఏపీలో సింగిల్ స్క్రీన్స్‌లో రూ.125, మల్టీప్లెక్స్‌ల్లో రూ.150 వరకు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించగా, తెలంగాణలో వరుసగా రూ.100, రూ.150 మేర పెంపు అవకాశం ఇచ్చారు.
ఇక సెన్సార్ బోర్డ్ *‘ఓజీ’* సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేసింది. మూవీలో అధిక స్థాయిలో ఉన్న హింసాత్మక సన్నివేశాల కారణంగానే ఈ రేటింగ్ ఇచ్చినట్లు సమాచారం. సినిమా రన్‌టైమ్ 2 గంటల 34 నిమిషాలు (154 నిమిషాలు 15 సెకన్లు)గా లాక్ అయ్యింది. పవన్ కళ్యాణ్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించి మెప్పించాడు. ఇక థమన్ సంగీతం కూడా సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయింది. మరి మూవీ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.