Saika Ishaque : మహిళల ప్రీమియర్ లీగ్(WPL) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ టోర్నలో ఆడుతున్న ఐదు జట్లలో ఒక్క ముంబై మాత్రమే ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించింది. ఓటమన్నదే ఎరుగని ఆ జట్టు నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరో తెలుసా..? విదేశీ క్రీడాకారిణులో.. మేటి బ్యాటర్లో కాదు. అయిదున్నర అడుగుల ఎత్తున్న ఎడమచేతి వాటం బౌలర్. వికెట్ అవసరమైనపుడల్లా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఆమె చేతికి బంతిని అందించడం, వెంటనే వికెట్ పడగొట్టి జట్టులో ఉత్సాహం నింపడం నిత్యకృత్యమైంది. ఆమే సైకా ఇషాక్.
తక్కువ ఎత్తున్న సైకా (Saika Ishaque) చూపులకు ఆనకున్నా, బంతి అందుకుందంటే వికెట్ తీయడం ఖాయం. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే, ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలుస్తోంది. టోర్నీలో 12 వికెట్లు తీసి పర్పల్ క్యాప్ పోటీలో అందరికంటే ముందుంది. ఢిల్లీ కేపిటల్స్‌తో మ్యాచ్‌లో ఇషాక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా అందుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్‌పై 11 పరుగులకే 4 వికెట్లు పడగొట్టిన ఆమె తన సత్తా చాటుకుంది. ఆ తర్వాతి నుంచి ముంబై మ్యాచ్ విన్నర్‌గా అవతరించింది.
సైకా తన ప్రదర్శనతో ప్రత్యర్థుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. సైకా పడగొట్టిన వికెట్లలో టోర్నీ టాప్10 స్కోరర్లు కూడా ఉన్నారంటే ఆమె ఎంత నియమబద్ధంగా బౌలింగ్ చేస్తున్నదో అర్ధమౌతుంది. యూపీ వారియర్స్ స్పిన్నర్ సోఫీ ఎకల్‌స్టోన్ (ఇంగ్లండ్) సైతం సైకాను మెచ్చుకుంది. ‘ముంబయి ఇండియన్స్‌కు ఇషాక్ వరం వంటిద’ని అంది. 8 టోర్నీలో తాను చూసిన ఉత్తమ బౌలర్ సైకానేనని వికెట్లతో రెండో స్థానంలో ఉన్న సోఫీ తేల్చిచెప్పింది. యూపీ వారియర్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకాలు బాదిన అలిసా హీలి, తహిల మెక్‌గ్రాత్‌లను ఇషాక్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చి మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసింది. ఆ ఓవర్ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అని, తమ విజయానికి కారణం అని ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సైతం అంగీకరించింది.
బెంగాల్‌కు చెందిన 27 ఏళ్ల సైకాకు చిన్నతనం నుంచే క్రికెట్‌పట్ల మక్కువ. బెంగాల్ అండర్-16, అండర్-23 జట్లకు ప్రాతినిథ్యం వహించింది. తన బౌలింగ్ ప్రదర్శనతో బెంగాల్‌కు అండర్-23 టైటిల్ అందించింది. బౌలర్గానేగాక కీపింగ్‌లోనూ సైకా దిట్ట. ఆమెకు బైక్ నడపడమంటే ఎంతో సరదా. మహిళా ప్రీమియర్ లీగ్ వేలంలో ముంబై ఇండియన్స్ ఆమెను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ లీగ్‌లో సత్తా చాటుతున్న సైకా జాతీయ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.