– మూడున్నర దశాబ్ధాల సమస్య పరిష్కారం
నిడమనూరు, జులై 05 : ఓ వ్యక్తి సాదా కాగితంపై మూడున్నర దశాబ్ధాల క్రితం కొనుగోలు చేసిన భూమికి భూ భారతిలో మోక్షం లభించింది. వివరాల్లోకి వెళ్తే… నల్లగొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రానికి చెందిన రుద్రాక్షి ముత్తయ్య 1993, జూన్ 28న బూరుగు గోవిందయ్య వద్ద సర్వే నెం. 247/ఆ/1 లో ఎకరం 13 గుంటలు సాదా కాగితంపై కొనుగోలు చేశాడు. 33 సంవత్సరాలుగా పట్టా మార్పిడి కాకపోగా, భూ విక్రేత గోవిందయ్య పేరుతోనే పట్టా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో ముత్తయ్య కార్యాలయం చుట్టూరా తిరుగుతూనే ఉన్నాడు.
ఇటీవల భూ భారతిలో ముత్తయ్య దరఖాస్తు చేయడంతో తాసీల్ధార్ జంగాల కృష్ణయ్య, గిర్ధావర్ దాడి రాజిరెడ్డి క్షేత్రస్థాయి విచారణ చేశారు. అనంతరం ఖమ్మంలో ఉంటున్న గోవిందయ్యను రప్పించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ముత్తయ్య పేరున పట్టా చేసేందుకు ఒప్పించడంతో గోవిందయ్య పెద్దల సమక్షంలో శనివారం ముత్తయ్యకు రిజిస్ట్రేషన్ చేశాడు. మూడున్నర దశాబ్ధాలుగా పట్టా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డ ముత్తయ్య పట్టా మార్పిడి జరగడంతో ఆనందం వ్యక్తం చేస్తూ తాసీల్ధార్కు కృతజ్ఞతలు తెలిపాడు.