కొడంగల్, జూన్ 19 : దేశంలోని పలు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో దిగ్గజాలైన ముగ్గురు సీఎంలు ఓడిపోయారని.. తెలంగాణలో వచ్చేసారి జరిగే ఎన్నికల్లోనూ రేవంత్‌రెడ్డి ఓటమి చెందడం ఖాయమని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్, దుద్యాల మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, సర్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. 30 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు విసుగు పుట్టిందని..కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తున్నారన్నారు.
గత బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అంద గా.. కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీ ల్లో ఏ ఒక్కటీ అమలు కావడంలేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలో నెలకో కొత్త స్కీం అమలు కాగా.. నేటి ప్రభుత్వంలో నెలకో కొత్త స్కాం బయటపడుతున్నదని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి అభివృద్ధిని విస్మరించి స్వలాభంకోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఓట్లు అవసరం ఉన్నప్పుడే రైతుభరోసా నిధులను విడుదల చేస్తున్నారని.. ముఖ్యమంత్రికి అన్నదాతలపై ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఇటీవల జరిగిన మద్దూ ర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఎన్ని ఎత్తులు వేసినా ఆరు కౌన్సిలర్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నదని.. ఈ విధంగానే రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి పోయిందని, గతంలో కేసీఆర్ అమలు చేసిన పథకాల పేర్లను మార్చుతూ రేవంత్‌రెడ్డి వాటికే తిరిగి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవా లు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. సొంత సెగ్మెంట్‌ను అభివృద్ధి చేసుకునే సోయీ రేవంత్‌కు లేదన్నారు. ఆయనకు రాష్ర్టాభివృద్ధి కంటే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయించి జైలుకు పంపాలనే ఆలోచనలోనే ఉన్నాడన్నారు.
సభ్యత్వ నమోదుతోనే పార్టీ బలగం పెరుగుతుందని.. బూత్ లెవల్లో నియమితులైన బీఎల్వోలు సభ్యత్వ నమోదుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సబితారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈ సారి కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదును చేయించి.. రాను న్న ఎన్నికల్లో పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. మీటింగ్‌కు హాజరైన గులాబీ దండును చూస్తే.. కొడంగల్ సీఎం ఇలాకాలా లేదని.. బీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్నదని వారు పేర్కొన్నా రు. అక్రమ కేసులకు ఎవరూ భయపడొద్దని పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. రానున్నది మన ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదుతో పార్టీ మరింత బలోపేతం అవుతుంది. సభ్య త్వ నమోదులో పార్టీ బీఎల్వోలు చురుగ్గా వ్యవహరించాలి. పార్టీ కి కార్యకర్తలే పట్టుగొమ్మలు. పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపడదాం. కొడంగల్‌లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేద్దాం. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులకు భయపడొద్దు. పార్టీ అండగా ఉంటుంది.
-మహేశ్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే
నియోజకవర్గంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రతి గ్రామంలోనూ 50 శాతం ఉండేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి. బీఎల్వోలు తమతమ బూత్‌లలో ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దూర ప్రాంతాల్లో ఉన్న వలస ఓటర్లను గుర్తించాలి. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది తూకాల్లో క్వింటాల్‌కు 8 నుంచి 19 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. వేరుశనగ, కంది సబ్సిడీ విత్తనాల సరఫరాలో రూ. 7 కోట్ల వరకు స్కాం జరిగిం ది. అందుకు బాధ్యులైన కాంగ్రెస్ నాయకులను వదిలివేసి అమాయకులైన ఉద్యోగులపై సర్కార్ వేటువేసింది. స్కాంకు బాధ్యులైన కాంగ్రెస్ నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గంలో ఇసుక, ఎర్రమట్టి అక్రమ తరలింపు జోరుగా సాగుతున్నది.
– పట్నం నరేందర్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే
రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలన్నా.. కాంగ్రెస్‌ను కనుమరుగు చేయాలన్నా ఓటు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. ప్రతి ఓటూ ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది. సర్ కార్యక్రమాన్ని బూత్ లెవల్ అధికారులు జాగ్రత్తగా నిర్వహించి ఓట్లను కాపాడాలి. ఈ సారి డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతున్నది. ప్రత్యేక గుర్తింపు కార్డు ఇస్తారు. పదేండ్లకొకసారి ఓటరు జాబితా సవరణ జరుగుతుంది. ఇప్పుడే మనం అప్రమత్తంగా ఉండాలి.
-డా.మెతుకు ఆనంద్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని సృష్టించాలంటే ప్రతి ఓటు మనకు ప్రత్యేకమే. మన ఓటును మనం కాపాడుకోవడంతోపాటు దొంగ ఓట్లను నివారించాలి. అదేవిధంగా సభ్యత్వ నమోదును పటిష్టంగా చేపట్టి పార్టీకి బలాన్ని సమకూర్చాలి. ఈ సారి సభ్యత్వ నమోదు డిజిటల్ విధానంలో సాగుతున్నది. మొన్న జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారు. అందుకు కారణం దొంగ ఓట్లు, వలస ఓట్లే. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. ప్రస్తుత కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సభ్యత్వ నమోదు చక్కటి వేదిక.
-నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ