సిటీబ్యూరో , జూన్ 19 (నమస్తే తెలంగాణ): క్యూర్ (జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ) పరిధిలోని ప్రజలు వివిధ రకాల ప్రభుత్వ పన్నులు, యూటిలిటీ బిల్లులకు వేర్వేరు పోర్టల్స్ చుట్టూ తిరిగే తిప్పలు తప్పనున్నాయి. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ శుక్రవారం జీవో నంబర్ 627ను జారీచేశారు. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్, ఖాళీ స్థలాల పన్ను (వీఎల్టీ), విద్యుత్ బిల్లులు, జలమండలి నీటి బిల్లులు, ట్రాఫిక్ ఛలాన్లు..ఇలా అన్నింటినీ క్యూర్ 1 (CURE 1) మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా ఒకే ప్ల్లాట్ఫామ్పై చెల్లించవచ్చు.
ఈ చెల్లింపులన్నీ మీ సేవ సమగ్ర పేమెంట్ గేట్‌వే ద్వారా సురక్షితంగా సాగనున్నట్లు ఉత్తర్వులో తెలిపారు. ఈ ప్రాజక్టును పర్యవేక్షించడానికి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్‌పర్సన్‌గా, మీ సేవ డైరెక్టర్ కన్వీనర్‌గా, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ కోకన్వీనర్, మెంబర్లుగా జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు, జలమండలి ఎండీ, హైదరాబాద్ ట్రాఫిక్ సీపీ, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కమిషనర్లు, జీహెచ్ఎంసీ ఐటీ అడిషనల్ కమిషనర్‌గా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. జీవో విడుదలైన 90 రోజుల్లోగా ప్రస్తుతం విడివిడిగా ఉన్న బిల్లింగ్ వ్యవస్థలన్నీ క్యూర్ 1 పరిధిలోకి మారాలని జీవోలో స్పష్టం చేశారు.