S Jaishankar | జెనీవా: విదేశాంగ మంత్రి జైశంకర్ సమస్యకు ఇరువైపులా తానే ఉన్న సంఘటనను గుర్తు చేసుకున్నారు. డిమాండ్ చేసేవారి పక్షంలోనూ, పరిష్కారాన్ని చూపించే పక్షంలోనూ తానే ఉన్న ఆ సంఘటన 1984లో జరిగినట్లు తెలిపారు. జెనీవాలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత సంతతి ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.
ఇటీవల విడుదలైన టెలివిజన్ సిరీస్ ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ గురించి ప్రశ్నించినపుడు ఆయన బదులిస్తూ, ఈ సిరీస్‌ను తాను చూడలేదని చెప్పారు. 1984లో ఓ విమానం హైజాక్‌కు గురైందని, అప్పట్లో తాను వెరీ యంగ్ ఆఫీసర్నని చెప్పారు.
ఆ విమానంలో తన తండ్రి కే సుబ్రహ్మణ్యం (ఐఏఎస్ అధికారి) ఉన్నట్లు తనకు ఆ తర్వాత తెలిసిందన్నారు. ఆ విమానాన్ని హైజాకర్లు దుబాయ్ తీసుకెళ్లిపోయారని, ఎవరినీ చంపలేదని అన్నారు. ఆ సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కుటుంబ సభ్యుల్లోనూ, సమస్యను పరిష్కరించే బృందంలోనూ తాను ఉన్నానని చెప్పారు.